అమ్మ కాకుండానే.. అనంతలోకాలకు..!

11 Jun, 2021 06:57 IST|Sakshi
ప్రమాదానికి గురై అంబులెన్స్, మృతులు

గర్భిణిని ప్రసవానికి తీసుకెళ్తూ.. ప్రమాదానికి గురైన అంబులెన్స్‌ 

టైర్‌ పేలడంతో నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొన్న వైనం

గర్భిణి సహా అత్త, ఆడపడుచు మృతి

మరో ముగ్గురికి తీవ్రగాయాలు 

మాతృత్వాన్ని మృత్యువు మింగేసింది.. తల్లికావాలనే.. ఆమె కల.. కలగానే మిగిలిపోయింది. తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచిందన్న చందంగా.. తొలికాన్పులో బిడ్డను పోగొట్టుకున్న ఆ అభాగ్యురాలు.. రెండో కాన్పులోనైనా.. అమ్మకావాలని ఆరాటపడింది. పురిటినొప్పులు పడుతూనే.. కోటి ఆశలతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి బయలుదేరింది. అయితే అతివేగం ఆమె ఆశల్ని చిదిమేసింది..దయలేని దేవుడు అమ్మకాకుండానే ఆమెను.. అనంతలోకాలకు తీసుకెళ్లిపోయాడు. 

సాక్షి, చెన్నై: పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళను సకాలంలో ఆస్పత్రిలో చేర్చేందుకు అతివేగంగా వెళ్లిన అంబులెన్స్‌ గురువారం వేకువ జామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గర్భిణితో సహా ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురం సమీపంలోని పుదుపట్టు గ్రామానికి చెందిన కన్నన్‌ భార్య జయలక్ష్మికి వేకువజామున పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఉదయం 4 గంటల సమయంలో కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్‌లో జయలక్ష్మి(26), ఆమె అత్త సెల్వి(55), అడపడుచు అంబిక(30)తో పాటుగా వైద్యసాయం నిమిత్తం నర్సు మీనా, అంబులెన్స్‌ అస్టిసెంట్‌ తేన్‌మొళి బయలుదేరారు. సకాలంలో ఆ గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించాలన్న కాంక్షతో డ్రైవర్‌ కళియమూర్తి అంబులెన్స్‌ను వేగంగా నడిపాడు. అయితే వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఆలత్తూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా అంబులెన్స్‌ టైర్‌ పేలడంతో వాహనాన్ని నియంత్రించ లేని పరిస్థితి నెలకొంది. దీంతో అతి వేగంగా అంబులెన్స్‌  చింతచెట్టును ఢీకొంది.

రెండోసారి ప్రసవం కోసం.. 
అంబులెన్స్‌ చెట్టుని పెద్దశబ్ధంతో ఢీకొని ఆగడంతో అటుగా వెళ్తున్న వారు, స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో సెల్వి, అంబిక అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న గర్భిణి జయలక్ష్మి, నర్సు మీనా, అస్టిసెంట్‌ తేన్‌మొళి, డ్రైవర్‌ కళియమూర్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యంలో పరిస్థితి విషమించి జయలక్ష్మి మరణించింది. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ సైతం మృతి చెంద డంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. తొలికాన్పు సమయంలో బిడ్డను జయలక్ష్మి కోల్పో గా, రెండో కాన్పు సమయంలో ఏకంగా ఆమెతో పాటుగా కడుపులోని బిడ్డ, అత్త, ఆడ పడుచులు మృత్యువు ఒడిలోకి చేరడం చూపరులను కలిచివేసింది. మిగిలిన ముగ్గురు వైద్య సిబ్బంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: కుప్పకూలిన విమానం: 12 మంది దుర్మరణం 
సూర్యాపేటలో తీగ లాగితే.. హైదరాబాద్‌లో కదిలిన డొంక!

మరిన్ని వార్తలు