ఏఎన్‌ఎం కక్కుర్తి.. ఇంట్లోనే ప్రసవం చేయడంతో...

27 Jan, 2021 09:30 IST|Sakshi
అంబులెన్స్‌లో హారాదేయి మృతదేహాన్ని గ్రామానికి తీసుకు వస్తున్న బంధువులు

డబ్బు తీసుకొని ఇంట్లోనే పురుడు పోసిన ఏఎన్‌ఎం 

రక్తస్రావంతో కొరాపుట్‌ ఆస్పత్రిలో మరణించిన బాలింత

జయపురం(ఒడిశా): ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగిలే చర్యలు చేపట్టి.. మాతా, శిశు మరణాలను అరికట్టాల్సిన ఆరోగ్య సిబ్బందే.. డబ్బుకు కక్కుర్తిపడి ఓ బాలింత ఉసురు తీశారు. నవరంగపూర్‌ జిల్లా చందాహండి సమితిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... ఓ గర్భిణికి ఇంట్లోనే ఏఎన్‌ఎం డెలివరీ నిర్వహంచిన తరువాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కొరాపుట్‌ సహిద్‌ లక్ష్మణ నాయిక్‌ వైద్య కళాశాల మెడికల్‌లో మరణించింది. జిల్లాలోని దేవబంధు గ్రామంలో పురుషోత్తమ కెనర్‌ భార్య హీరాదేయి కెనర్‌ ఈనెల 21న పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.

ఈ విషయం ఆమె బంధువులు దేవబంధు మహిళా ఏఎన్‌ఎంకు తెలియజేశారు. అయితే ఆ సమయంలో ఏఎన్‌ఎం అందుబాటులో లేకపోవడంతో తమ ఇంటి పక్కనే ఉంటున్న ఖెందుబెడ సబ్‌సెంటర్‌ ఏఎన్‌ఎంకు సమాచారం అందించారు. గర్భిణి ఇంటికి వచ్చి పరిస్థితిని గమనించి ఆమె.. ఇంట్లోనే ప్రసవం చేయడం మంచిదని వారికి సలహా ఇచ్చింది. వాస్తవానికి పురిటి నొప్పులు మొదలైన సందర్భంలో గర్భిణిని 102 అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించాలి. అలా కాకుండా ఇంటి వద్దే డెలివరీ చేయమని సలహా ఇవ్వడంతో మరోమార్గం లేక ఆమె బంధువులు అంగీకరించారు. 

2శాతానికి పడిపోయిన హెచ్‌బీ.. 
22న హీరాదేయి ఇంటి వద్దే మగబిడ్డను ప్రసవించింది. అయితే అదే రోజు సాయంత్రం రక్తస్రావం ఎక్కువ కావడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఏఎన్‌ఎం పర్యవేక్షణలో చందాహండి సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత క్షీణించడంతో వెంటనే నవరంగపూర్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ కూడా మెరుగుపడక పోవడంతో మరోమార్గం లేక కొరాపుట్‌ సహిద్‌ లక్ష్మణనాయిక్‌  వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం మరణించింది. అయితే పుట్టినబిడ్డ పరిస్థితి సంతృప్తి కరంగా ఉందని సమాచారం. హీరాదేయిని చందాహండి ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయానికి హిమోగ్లోబిన్‌ కేవలం 2శాతం మాత్రమే ఉండేదట. రక్తహీనత ఉన్నా కాన్పుకు ఆస్పత్రికి తీసుకు వెళ్లకుండా ఇంట్లోనే డెలివరీకి ప్రయతి్నంచడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

అయితే... తన భార్యకు ఇది నాలుగో కాన్పని పురుషోత్తమ్‌ వెల్లడించాడు. హీరాదేయికి నొప్పులు ఎక్కవగా రావడంతో వెంటనే పక్కింటి ఏఎన్‌ఎంను సంప్రదించామని.. ఆమె ఇంట్లోనే డెలివరీ చేస్తానని రూ.వెయ్యి తీసుకుందని ఆరోపించాడు. అసురక్షిత పరిస్థితిలో కాన్పు చేయడం వల్ల తన భార్య పరిస్థితి క్షీణించిందని వాపోయాడు. శాయశక్తులా ప్రయతి్నంచినా తన భార్య దక్కలేదని విలపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నవరంగపూర్‌ సీడీఎం.. దర్యాప్తుకు ఆదేశించారు.  

మరిన్ని వార్తలు