దారుణం: బస్సు కింద పడి గర్భిణి మృతి 

25 Feb, 2021 02:32 IST|Sakshi
షాలిని, సతీశ్‌గౌడ్‌ 

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

భార్యాభర్తల్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 

హైదర్‌గూడ ఫెర్నాండెజ్‌ హాస్పిటల్‌కి వెళ్లి వస్తుండగా ఘటన 

అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు పంపిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

సాక్షి, హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న దంపతుల్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో దంపతులిద్దరూ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరగా...భార్య ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బుధవారం హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వద్ద జరిగిన ఈ ప్రమాదం ఘటన వివరాలిలా ఉన్నాయి. ముషీరాబాద్‌ కుమ్మరిబస్తీకి చెందిన సతీశ్‌గౌడ్, భార్య షాలిని దంపతులు కాగా, షాలిని రెండు నెలల గర్భిణి. ఉదయం భార్యాభర్తలిద్దరూ హైదర్‌గూడ ఫెర్నాండెజ్‌ ఆస్పత్రికి రెగ్యులర్‌ చెకప్‌ కోసం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేస్తుండగా ...అదే సమయంలో ముషీరాబాద్‌ డిపోకు చెందిన ఏపీ28జెడ్‌0017 నంబర్‌ గల బస్సు కోఠి నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తుంది.


ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన బస్సు

హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వద్ద వేగంగా వస్తూ కుడివైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దంపతులను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అదుపుతప్పి కిందపడ్డారు. బసు వెనుక భాగం చక్రాల్లో పడిపోయిన షాలినికి కాలి తొడ భాగం, ఛాతీ భాగాలు నుజ్జు అయ్యాయి. వెంటనే అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మల్లేశ్‌ ఓ అంబులెన్స్‌ సాయంతో హైదర్‌గూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా..ఐసీయూలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా బస్సు నడిపిన మహబూబ్‌నగ్‌ జిల్లా ఫరీద్‌పూర్‌ గ్రామానికి చెందిన డ్రైవర్‌ కమలన్నని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అమ్మ ఏదని అడిగితే ఏం చెప్పాలి? 
షాలిని, సతీశ్‌లకు రెండేళ్ల కుమార్తె ఉంది. ప్రమాదం విషయంపై షాలిని భర్త సతీశ్‌ని ‘సాక్షి’ఫోన్‌ ద్వారా సంప్రదించగా.. ‘నా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. షాలిని లేకుండా ఇంటికి వెళ్తే నా రెండేళ్ల బంగారం(కూతురు) అమ్మ ఏది అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి?’అంటూ   రోదిస్తున్నాడు.  

చదవండి: (సహజీవనం చేస్తూ ‘రిచ్‌’గా బిల్డప్‌.. పక్కాగా చీటింగ్‌)

మరిన్ని వార్తలు