అమానుషం: నిండు గర్భిణీపైనా.. దయ చూపలేదు

15 May, 2021 13:00 IST|Sakshi

కరోనా అనుమానంతో వైద్యం నిరాకరించిన ఆసుపత్రులు

ఐదు గంటలపాటు అంబులెన్స్‌లోనే గర్భిణి నరకయాతన

చివరికి అంబులెన్స్‌లోనే ప్రాణాలు వదిలిన యువతి

కడుపులో బిడ్డ కూడా మృతి

మల్లాపూర్‌/సుల్తాన్‌బజార్‌: కరోనా ఉందన్న అనుమానంతో ఏ ఆస్పత్రి కూడా వైద్యం అందించేందుకు ముందుకు రాలేదు. వైద్యం కోసం నగరమంతా.. నాలుగు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఏ డాక్టరూ కరుణించలేదు. బోసినవ్వుల పాపాయికి జన్మనివ్వాల్సిన ఓ నిండు గర్భిణి ఐదు గంటలపాటు నరకయాతన పడి చివరకు అంబులెన్స్‌లోనే ప్రాణం విడిచింది. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.  

నాచారం మల్లాపూర్‌ నాగలక్ష్మినగర్‌కు చెందిన తిరుమలరావు భార్య పావని (22) ఎనిమిది నెలల గర్భిణి. స్వల్ప అస్వస్థతతో గురువారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. సిబ్బంది ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎలా వెళ్లాలో తెలియక చివరకు ఇంటికి వెళ్లిపోయారు. అయితే అదేరోజు రాత్రి పావనికి దగ్గు ఎక్కువ కావడంతో శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో మల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది బెడ్స్‌ ఖాళీ లేవని, మరో ఆస్పత్రి పేరు చెప్పి పంపించేశారు. పావని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మల్లాపూర్‌ నుంచి హుటాహుటిన అంబులెన్స్‌లో నేరుగా ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా నిరాశే ఎదురైంది.

బెడ్స్‌ ఖాళీ లేవని, వేరే ఆస్పత్రికి వెళ్లమంటూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే సమీపంలో ఉన్న మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా పావనికి వైద్యం అందలేదు. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయని, ఇక్కడ వైద్యం అందించడం కుదరదని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లండని చెబుతూ బయట నుంచే పంపించేశారు. ఈలోగా పావని పరిస్థితి మరింత విషమంగా మారింది. కూతురు పరిస్థితి వివరించి, ప్రాణం కాపాడాలని ఆస్పత్రి వర్గాలను ఎంత వేడుకున్నా ఎవరూ కనికరించలేదు. దీంతో చివరకు కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం 6 గంటల సమయంలో వారు బయలుదేరగా కోఠి ఆస్పత్రికి చేరుకునే సరికి ఉదయం 11 గంటలు కావచ్చింది. అయితే అక్కడ కూడా సిబ్బంది వెంటనే స్పందించలేదు. దీంతో, ఆస్పత్రి బయటే చాలాసేపు అంబులెన్స్‌లోనే నిండు గర్భిణి కొట్టుమిట్టాడింది.

కుటుంబ సభ్యులు వేడుకోవడంతో ఎట్టకేలకు వైద్యులు వచ్చి చూసేసరికి అంబులెన్స్‌లోనే పావని విగత జీవిగా కనిపించింది. తల్లిని ఎలాగో కాపాడుకోలేకపోయాం, కనీసం కడుపులో ఉన్న శిశువునైనా కాపాడాలని ఆస్పత్రి వైద్యులను కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై వేడుకున్నారు. ఇంత జరిగినా వారిలో జాలి కలగలేదు. ఉన్నతాధికారులను సంప్రదించాలని చెబుతూ కాలయాపన చేశారు. సమయం మించిపోవడంతో తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డకూడా ప్రాణాలు కోల్పోయింది. అసలు తన కూతురుకు కరోనా నిర్ధారించకుండానే, కేవలం అనుమానంతోనే ఆస్పత్రులు వైద్యం నిరాకరించాయని, ఆస్పత్రులన్నీ తిప్పించి చివరకు తన బిడ్డను దూరం చేశాయంటూ పావని తల్లి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. 

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే.. 
తమ కుమార్తెకి కోవిడ్‌ అన్న అనుమానంతో ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలంటూ కోఠి ఆస్పత్రి సిబ్బంది జాప్యం చేశారని, అందువల్లే పావని చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, ఆసుపత్రికి రాకముందే పావని మరణించిందని సిబ్బంది అంటున్నారు. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్‌ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. కోఠి ప్రసూతి ఆసుపత్రికి తీసుకువచ్చిన గర్భిణికి ఈసీజీ పరీక్ష చేశామని, అప్పటికే ఆమె మృతిచెందిందని డాక్టర్‌ రాజ్యలక్ష్మి తెలిపారు. తమ ఆసుపత్రిలో అరగంట పాటు వైద్యుల కోసం వేచిచూశారన్నది తప్పుడు ఆరోపణ అన్నారు. ముందు రోజు రాత్రి నుంచే మృతురాలికి దగ్గు, జలుబు ఉండటం, ఉమ్మనీరు తగ్గిపోవడంతో మరణించి ఉండవచ్చన్నారు. 

చదవండి: Covid-19: ఆస్పత్రిలో బెడ్స్‌ కావాలా?

మరిన్ని వార్తలు