విశాఖ బీచ్‌లో గర్భిణీ మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు.. సూసైడ్‌ నోట్‌ స్వాధీనం

27 Apr, 2023 12:30 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  విశాఖ బీచ్‌లో శవమై తేలిన మహిళ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. వివాహిత శ్వేత మృతికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే శ్వేత తల్లి రమాదేవి స్టేట్‌మెంట్‌ను త్రీటౌన్‌ పోలీసులు నమోదు చేశారు. ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో గొడవపడినట్లు విచారణలో తేలింది. అయితే అత్తమామలు వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు

విడాకులు ఇస్తానని భర్త బెదిరింపులు
కాగా అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు చనిపోయిందని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు. పెళ్లైన నెల రోజుల నుంచే కూతుర్ని వేధించడం ప్రారంభించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి అసలు గుణం అప్పుడే బయటపడిందని.. నెల రోజులు క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను భర్త మణికంఠ బెదిరించాడని పేర్కొన్నారు.

ఈ మేరకు మృతురాలి తల్లి మాట్లాడుతూ శ్వేత అత్తింటి వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తన కూతురు అయిదు నెలల గర్భిణీ అని.. కడుపుతో ఉన్నా కూడా కనికరించకుండా అత్తామామలు చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేవారని, అత్త మామలు చెప్పిన పనులు చేయాలంటూ ఫోన్లో భర్త కూడా ఆదేశాలిచ్చేవాడని పేర్కొన్నారు.

ఫోన్‌ చేసి రోజూ ఏడ్చేది..
‘భర్తను పొగొట్టుకున్నాను. కూతుర్ని ఒక్కదాన్నే కష్టపడి పెంచి పెద్ద చేశాను. అత్తమామలు ఇబ్బందులు పెడుతున్నారని రోజూ ఫోన్‌ చేసి ఏడ్చేది. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతానని చెప్పింది. పెళ్లైన తరవాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారు. శ్వేత అత్త నటిస్తోంది. అత్తింటి వేధింపులు, భర్త టార్చర్ వల్ల శ్వేత ప్రాణం తీసుకుంది. నా ఒక్కగానొక్క కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’ అంటూ వాపోయారు.

సూసైడ్‌ నోట్‌
ఇదిలా ఉండగా శ్వేత చనిపోయేముందు ఓ సూసైడ్‌ నోట్‌ రాసింది. ఇందులో  ‘చిట్టీ...నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం ఫరక్ పడదు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.. అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా యూ నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శ్వేత భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తుండగా.. విశాఖపట్నంలో అత్తమామల వద్ద శ్వేత ఉంటోంది. మంగళవారం అత్తతో గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఫోన్‌లో భర్తతోనూ గొడవపడింది. తర్వాత విగత జీవిగా బీచ్‌లో కనిపించింది.
చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది జవాన్లు మృతి..

మరిన్ని వార్తలు