బేడీలపై దురుద్దేశం లేదు

31 Oct, 2020 03:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎస్కార్ట్‌ సిబ్బందికి వారి వివరాలూ తెలియవు

పోలీస్‌శాఖ ప్రాథమిక విచారణలో వెల్లడి

కొనసాగుతున్న శాఖాపరమైన విచారణ

సాక్షి, గుంటూరు: నిజాలతో పనిలేదు.. నిర్ధారించుకునే ప్రయత్నమూ లేదు. విషయం ఏదైనప్పటికీ విమర్శలే పరమావధిగా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. రాజధాని అమరావతిలో దళితులను అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే క్రమంలో పోలీస్‌ శాఖకు చెందిన ఏఆర్‌ సిబ్బంది బేడీలు వేయడాన్ని టీడీపీ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి ఏఆర్‌ విభాగానికి చెందిన ఎస్కార్ట్‌ సిబ్బందికి రిమాండ్‌ ఖైదీల వివరాలు తెలిసే అవకాశం లేదని, ముందు జాగ్రత్తలో భాగంగానే ఇలా వ్యవహరించారని తెలుస్తోంది. నరసరావుపేట సబ్‌ జైలు నుంచి జిల్లా జైలుకు రిమాండ్‌ ఖైదీలను తరలించేటప్పుడు బేడీలు వేయడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసు శాఖ ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

విచారణ జరుగుతోంది..
జైళ్ల శాఖ విజ్ఞప్తి మేరకు పోలీస్‌ శాఖలోని ఏఆర్‌ విభాగం సిబ్బంది ఖైదీలకు ఎస్కార్టుగా వెళ్తుంటారు. ఖైదీలను ఫలానా చోట నుంచి నిర్దేశిత ప్రాంతానికి తీసుకువెళ్లాలని మాత్రమే జైలు అధికారులు పోలీసులకు సూచిస్తారు. ఖైదీలు ఏ కేసుల్లో అరెస్టయ్యారు?ఊరు, పేర్లు, తదితర వివరాలపై ఎస్కార్టు పోలీసులకు సమాచారం ఉండదు. ఈ క్రమంలో మంగళవారం నరసరావుపేట నుంచి గుంటూరుకు ఖైదీలను తరలించే సమయంలో ముందు జాగ్రత్తలో భాగంగా 43 మందికి ఎస్కార్టు సిబ్బంది బేడీలు వేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. దీనిపై డీఐజీ త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు ఎస్పీ విశాల్‌ గున్నీ శాఖాపరమైన విచారణను కొనసాగిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో ఈ నెల 23న జరిగిన రిలే నిరాహార దీక్షలకు కొందరు దళితులు ఆటోల్లో వెళుతుండగా కృష్ణాయపాలెం వద్ద అమరావతి మద్దతుదారులు అడ్డుకుని దాడి యత్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేయగా న్యాయస్థానం వారికి రిమాండ్‌ విధించింది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులైన ఈ ఏడుగురితో పాటు హత్యాయత్నం కేసుల్లో ఇద్దరు, డెకాయిట్‌ కేసులో ముగ్గురు, పోక్సో కేసుల్లో ఇద్దరు, చోరీ కేసుల్లో ముగ్గురు ఖైదీలు, 498ఏ, ఎక్సైజ్, ఇతర క్రిమినల్‌ కేసుల్లో ఉన్న నిందితులతో కలిపి మొత్తం 43 మందిని ఈనెల 27న నరసరావుపేటలో కరోనా పరీక్షల అనంతరం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఖైదీలకు బేడీలు వేయడం విమర్శలకు తావివ్వడంతో ఆరుగురు ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ అదే రోజు ఆదేశాలు జారీ చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా