ఆశ చూపించి.. ఉసూరుమనిపించి..

31 May, 2022 09:53 IST|Sakshi

ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): నిధుల సేకరణలో కమీషన్లు ఆశ చూపించి మా ప్రేమ సంస్థ యజమాని ముకుందా తమను మోసం చేశారంటూ ఓ వికలాంగ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంవీపీ కాలనీలోని మా ప్రేమ సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు, వికలాంగుడైన ముద్దులు సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ ఏడాది క్రితం వరకు మా ప్రేమ సంస్థలో వలంటీర్‌గా పని చేశానన్నారు. చారిటీ పేరిట సేకరించిన నిధుల్లో ప్రతి రోజు సగం కమిషన్‌గా ఇస్తానని సంస్థ అధినేత ముకుందా నమ్మబలికాడన్నారు.

దీంతో తెన్నేటి పార్కు నుంచి ఆర్కే బీచ్‌ వరకు పర్యాటకుల నుంచి రోజూ రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు సేకరించి ముకుందాకు ఇచ్చేవాడినన్నారు. కొన్ని రోజులు కమీషన్‌ సక్రమంగానే ఇచ్చిన ముకుందా.. తరువాత ఆపేశారని ఆరోపించారు. దీనికి తోడు జాలరిపేటకు చెందిన పలువురు మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి, వారి నుంచి డిపాజిట్‌ కింద రూ.3 వేలు తీసుకోవాలని తనకు సూచించాడన్నారు. దీంతో పదుల సంఖ్యలో మహిళల నుంచి నిధులు సేకరించినట్లు తెలిపారు.

అయితే వారికి ఎలాంటి రుణాలు ఇవ్వకపోవడంతో వారిలో కొందరు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని సంతోష్‌కుమార్‌ తెలిపారు. డబ్బులు విషయంపై ప్రశ్నించడంతో తనను వలంటీర్‌గా తొలగించాడన్నారు. న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, ఎంవీపీ పోలీసు స్టేషన్‌లో ముకుందాపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ముకుందాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

(చదవండి: అలలపై కలల నావ..!)

మరిన్ని వార్తలు