వీడు మామూలోడు కాదు.. విచారించాలంటూ పోలీసులకే లేఖ రాశాడు

5 Jul, 2021 00:55 IST|Sakshi

నోటీసులు ఇచ్చి.. విచారించండి! 

విచిత్రంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు 

లేఖ రాసిన అనుమానితుడు 

సాక్షి, హైదరాబాద్‌: కేసుల దర్యాప్తు సందర్భంగా నిందితులతో పాటు అనుమానితులకూ నోటీసులు ఇస్తుంటారు. అయితే సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు చిత్రమైన అనుభవం ఎదురైంది. రూ.60 లక్షల మోసం కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న మధ్యప్రదేశ్‌ వాసి ‘నన్ను పిలవండి.. విచారించండి’అంటూ లేఖ రాశాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ షేర్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తుంటారు. ఆమె వివరాలు తెలుసుకున్న సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి, ట్రేడింగ్‌ పేరిట రూ.5 లక్షలు తమ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు.

కొద్దిరోజుల తర్వాత మరోసారి ఫోన్‌ చేసి తమ వద్ద ఉన్న ట్రేడింగ్‌ ఖాతాలో ఉన్న మొత్తం రూ.4 కోట్లకు చేరిందని చెప్పారు. అది బదిలీ చేయాలంటే ముందుగా బ్రోకరేజ్‌ చెల్లించాలని షరతు విధించారు. దీంతో దాదాపు రూ.60 లక్షలు బ్యాంకు ఖాతా ల్లోకి ఆ మహిళ బదిలీ చేశారు. తర్వాత వారి నుంచి స్పందన లేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రజత్‌ పటారియాను ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావించారు. తప్పుడు ధ్రువీకరణలతో సిమ్‌ వినియోగించడంతో చిరుమానా పట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో చందన్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో రజత్‌ ఉంటాడని తెలుసుకుని వారికి సమాచారం ఇచ్చారు. ఇటీవల ఓ పని కోసం చందన్‌నగర్‌ ఠాణాకు వెళ్లిన రజత్‌కు పలానా కేసులో అనుమానితుడిగా ఉన్నట్లు అక్కడి పోలీసులు చెప్పారు. దీంతో సైబర్‌ క్రైం పోలీసులకు పోస్టు ద్వారా లేఖ పంపాడు.  తనకు నోటీసులిస్తే వస్తానంటూ అందులో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు