గాఢనిద్రలోనే... అనంతలోకాలకు

25 Aug, 2021 01:55 IST|Sakshi
ప్రమాదానికి గురైన వోల్వో బస్సు

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు.. ముగ్గురు మృతి

కామేపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా ప్రమాదం

మిర్యాలగూడ అర్బన్‌: తెల్లవారుజాము.. బస్సు వేగంగా వెళ్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు.. బస్సు ఒక్కసారిగా లారీని ఢీకొట్టింది. ఏం జరిగిందో తెలిసేలోపు ఇద్దరి ప్రాణాలు పోయా యి. రాఖీ పండుగను జరుపుకోవడానికి సొంత ఊళ్లకు వచ్చిన వారు పండుగను ముగించుకుని తిరిగి వెళ్తూ ప్రమాదం బారినపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రకాశం జిల్లా కామేపల్లి నుంచి ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు 40 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్‌ బయలు దేరింది. తెల్లవారుజామున 3 గంటలకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకోగానే అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి బైపాస్‌పై చింతపల్లి క్రాసింగ్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
ఆస్పత్రి బయట తన ఇద్దరు పిల్లలతో దీనంగా కూర్చున్న క్షతగాత్రురాలు   

ముందుభాగంలో కూర్చున్న ప్రకాశం జిల్లా పెద్దకాల్వకుంటకు చెందిన మేడుగ మల్లికార్జున్‌ (40), ముక్కెనవారిపాలెంకు చెందిన కొత్త నాగేశ్వర్‌రావు (44) ఇద్దరూ లారీ, బస్సుకు మధ్యలో ఇరు క్కుని అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్‌ లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ వీరు జీవ నం సాగిస్తు న్నారు. రోడ్డు ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న వన్‌టౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  బాధితులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుంటూరు జిల్లా నాగులవరం గ్రామానికి చెందిన సురభి జయరావు (42) మృతిచెందారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 15 మంది, బస్సు డ్రైవర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సదానాగరాజు తెలిపారు.  

మరిన్ని వార్తలు