అక్రమ కు.ని. ఆపరేషన్లపై విచారణ

11 Oct, 2021 05:49 IST|Sakshi
మెడికల్‌ షాపు వెనుక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న అనకాపల్లి వైద్య బృందం

విశాఖ కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు ఆదేశాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

పాడేరు: విశాఖ ఏజెన్సీలో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేటు వైద్య బృందంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విశాఖ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవోలకు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మారుమూల ఈదులపాలెం ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఓ మెడికల్‌ షాపులో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి గిరిజనుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్న వైనంపై ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ ఏడీఎంహెచ్‌వో, ఇతర వైద్య బృందాలను అప్రమత్తం చేశారు.

మెడికల్‌ షాపులో ఇంతవరకు జరిగిన ఆపరేషన్ల వివరాలను సేకరించడంతో పాటు ఆపరేషన్‌ జరిగిన మహిళలందరితో మాట్లాడి పూర్తి నివేదికను తనకు అందజేయాలని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ లీలా ప్రసాద్‌ను ఆదేశించారు. విచారణ అధికారిగా ఈదులపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ లకే శివప్రసాద్‌ పాత్రుడును నియమించారు. పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు సైతం ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నాయి.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు, మరో ప్రభుత్వ స్టాఫ్‌ నర్సు అని గుర్తించారు. ఇందుకు ఈదులపాలెం ఆస్పత్రిలోని కొంతమంది వైద్య సిబ్బంది కూడా సహకరించినట్టు ఇంటెలిజెన్స్‌ విచారణలో తేలింది. ఇక్కడ రెండు విడతలుగా భారీ సంఖ్యలో కు.ని. ఆపరేషన్లు చేసినట్టు ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు ప్రాథమిక సమాచారాన్ని అందజేశారు.  

మరిన్ని వార్తలు