2 ఆస్పత్రుల్లో 2 సర్జరీలు.. మృతదేహానికి పోస్టుమార్టం!

10 Dec, 2021 08:01 IST|Sakshi
షేక్‌ జునేద్‌(ఫైల్‌ఫోటో)

సాక్షి, గోల్కొండ(హైదరాబాద్‌): వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.గోల్కొండ పోలీసులు తెలిపిన మేరకు.. పుప్పాలగూడ ఫ్రెండ్స్‌ కాలనీకి చెందిని షేక్‌ అబ్దుల్‌ రహీం లక్డీకపూల్‌లో మిరాకిల్‌ గ్లాస్‌ ట్రేడర్‌ పేరు షాపు నిర్వహిస్తున్నాడు.

ఈనెల 2వ తేదీ సాయంత్రం తన వీపు పై భాగంలో నొప్పిగా ఉందని, అక్కడ కురుపు లాగా ఉందని రహీమ్‌ కొడుకు షేక్‌ జునేద్‌ (21) తండ్రికి తెలిపాడు. దీంతో తండ్రి షేక్‌ అబ్దుల్‌ రహీమ్‌.. జునేద్‌ను పుప్పాలగూడలోని ప్రో లైఫ్‌ ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడ డాక్టర్‌ సజ్జాద్‌ షేక్‌ జునైద్‌కు పరీక్షలు నిర్వహించి క్లినిక్‌లోకి తీసుకువెళ్లి షేక్‌ అబ్దుల్‌ రహీమ్‌ను అడగకుండానే మైనర్‌ సర్జరీ చేసి కురుపును తొలగించాడు.

సర్జరీ విషయం తెలిసిన జునైద్‌ తండ్రి ఎటువంటి పరీక్షలు లేకుండానే, తన అనుమతి లేకుండానే ఎందుకు చేశావని నిలదీశాడు. ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో షేక్‌ జునేద్‌కు నొప్పి బాగా పెరిగింది. అక్కడరక్తస్రావమైంది. గమనించిన డాక్టర్‌ సజ్జాద్‌ షేక్‌ జునైద్‌ను వెంటనే టోలిచౌకిలోని ఆపిల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. అక్కడ షేక్‌ జునేద్‌కు ఆపరేషన్‌ చేయాలంటూ వైద్యులు నేరుగా ఆపరేషన్‌ థియేటర్‌కి తీసుకెళ్లారు.

కురుపు వద్ద మైనర్‌ సర్జరి చేసే సమయంలో సూది జునైద్‌ శరీరంలోనే ఉండిపోయిందని డాక్టర్‌ సజ్జాద్‌ తెలిపారు. ఇదిలా ఉండగా 3వ తేదీ తెల్లవారు జామున షేక్‌ జునైద్‌ చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆపిల్‌ ఆస్పత్రిలో కూడా అనుమతి లేకుండా సర్జరీ చేశారని షేక్‌ అబ్దుల్‌ రహీం తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదును గోల్కొండ పోలీసులు బుధవారం స్వీకరించి కేసు నమోదు చేశారు.

మృతుడి తండ్రి విజ్ఞప్తి మేరకు గురువారం ఉస్మానియా వైద్యులు ఖననం చేసిన షేక్‌ జునైద్‌ మృతదేహాన్ని వెలికితీసి అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కాగా సెవెన్‌ టూంబ్స్‌ సమీపంలోని స్మశానవాటిలో పోస్టుమార్టం నిర్వహించే సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  

మరిన్ని వార్తలు