ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.10 కోట్ల వసూలు!

22 Aug, 2021 18:24 IST|Sakshi

సాక్షి,విశాఖపట్నం: జీవీఎంసీలో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి వసూళ్లకు ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ తెగబడుతోంది. స్వచ్ఛాంధ్ర కింద జీవీఎంసీకి రానున్న వాహనాల డ్రైవర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుందని.. ఇందుకోసం పోస్టుకు లక్షన్నర నుంచి రూ.2 లక్షల మేర వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా మొత్తం 600 పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను కూడా సదరు ప్రైవేటు ఏజెన్సీ తీసుకుంటున్నట్టు సమాచారం. తద్వారా ఏకంగా రూ.10 కోట్ల మేర వసూలుకు తెగబడినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

మురళీనగర్‌లోని ఒక ఇంటి అడ్రస్‌ ఇచ్చి.. కొన్ని ఫోన్‌ నంబర్లను మార్కెట్‌లోకి సదరు ప్రైవేటు సంస్థ వదిలింది. అడ్రస్‌లో ఉన్న ఇంటికి వెళ్తే అక్కడ ఎవరూ ఉండడంలేదు.. కానీ పక్కింటిలో ఉన్నారనే సమాచారం వస్తోంది. అక్కడకు వెళ్లి ఫోన్‌ నంబర్లు పనిచేయడం లేదని ఆరా తీస్తే.. మరో ఫోన్‌ నంబర్‌ ఇస్తున్నారు. ఆ తర్వాత వసూలు ప్రక్రియ సాగుతోంది. జీవీఎంసీలో ఉద్యోగాలని, భవిష్యత్తులో పరి్మనెంటు అవుతాయనే భ్రమలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు. ఫలితంగా నిరుద్యోగులు కూడా నగదును సమర్పించుకునేందుకు సిద్ధమవుతున్నారు.  

ఒక్కో ఉద్యోగానికి లక్షన్నర! 
జీవీఎంసీలో చెత్త సేకరణ కోసం త్వరలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా 600 చెత్త సేకరణ వాహనాలు రానున్నాయి. ఇందులో 300 మేరకు ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉంది. దీనిని సదరు ప్రైవేటు ఏజెన్సీ తన వసూలుకు అవకాశంగా మలచుకున్నట్టు తెలుస్తోంది. చెత్త సేకరణ కోసం వచ్చే వాహనాలకు డ్రైవర్‌ పోస్టుల భర్తీ కాంట్రాక్టు తమ సంస్థకే వచ్చిందని చెబుతున్నట్టు సమాచారం.

అందువల్ల తామే పోస్టులను భర్తీ చేస్తామని, దరఖాస్తులను ఆహ్వనిస్తున్నామని చెబుతోంది. ఒక్కో ఉద్యోగానికి లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకూ వసూలుకు తెగబడుతోంది. ఈ విధంగా నగదు ఇచ్చిన వారికే ఉద్యోగాలని, దరఖాస్తుల ప్రక్రియ అంతా కేవలం ప్రొసిజర్‌ కోసమని సదరు ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విధంగా మొత్తం 600 మంది నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ వసూలు చేయడం ద్వారా రూ.10 కోట్ల మేర ఆర్జనకు స్కెచ్‌ వేసినట్టు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు