మద్యం సేవించిన యువతీ, యువకుడు

9 Nov, 2020 17:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన కారు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వోల్వో కారులో ఇద్దరు విద్యార్థులు బంజారాహిల్స్ నుంచి లింగంపల్లి వైపు వెళ్తుండగా సెంట్రల్ యూవర్శిటీ గేట్ 2 వద్ద రోడ్డు పక్కనే ఉన్న చెట్టును వేగంగా వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రియాంక(20) అక్కడికక్కడే మృతి చెందగా.. మిత్తి మోడీ (20) స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో ఇద్దరూ సీటు బెల్ట్‌ పెట్టుకోలేదని పోలీసుల ద్వారా తెలిసింది. మృతురాలు ప్రియాంక జర్జియాలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ వచ్చి.. ఇక్కడే ఉంటున్నారు. ప్రమాద విషయం తెలిసిన అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి.

మద్యం సేవించిన యువతీ, యువకుడు..
ప్రమాద సమయంలో కారు డ్రైవింగ్‌‌ చేస్తున్న యువకుడు మోడీ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని  ఎయిర్ లైఫ్ పబ్‌లో యువతీ, యువకుడు మద్యం సేవించినట్లు వెల్లడైంది. యువకుడు మోడీ కి బ్రీత్ అనలైజ్ టెస్ట్ లో 45 శాతం నమోదైంది.  పబ్బులో మద్యం సేవించాక గచ్చిబౌలి వైపు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై ప్రియాంక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడుపై ఐపీసీ సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువకుడు వైజాగ్‌లో డిగ్రీ చదువుతున్నాడు. ఓ ప్రముఖ వ్యాపారి కుమారుడు అని తెలుస్తోంది. అయితే విశాఖ యువకుడు హైదరాబాద్‌ ఎందుకొచ్చాడని పోలీసుల ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మోడీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ప్రియాంక మృతిపట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు