ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి అరెస్ట్‌ 

15 Oct, 2022 11:13 IST|Sakshi

డ్వాక్రా మహిళలపై దాడి ఘటనలో.. ప్రవీణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఘర్షణ : ఏఎస్పీ

ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్‌ జిల్లా) : డ్వాక్రా మహిళలపై దాడి చేసిన కేసులో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీడీపీ పట్టణాధ్యక్షురాలు బోగాల లక్ష్మీనారాయణమ్మతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పొదుపు ఖాతాల్లో అవినీతి జరగలేదని, ఆడిట్‌ జరిగి ఒకవేళ అవినీతి జరిగిందని నిర్ధారణ అయితే ఆ డబ్బు తాను చెల్లిస్తానని  హామీ ఇచ్చారు.

దీంతో మహిళలు తమ డబ్బు ఇవ్వాలని ప్రవీణ్‌ ఇంటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ  ఘటనకు సంబంధించి శుక్రవారం వేకువజామున ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్‌ చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. వీరిపై 147, 148, 323, 324, 307, 386, 509 రెడ్‌విత్‌ 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. గురువారం జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. 

ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఘర్షణ : ఏఎస్పీ ప్రేర్ణాకుమార్‌ 
టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెచ్చగొట్టేలా వ్యవహరించడం వల్లే గొడవ జరిగిందని ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేర్ణాకుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి డీఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్‌ 12న లక్ష్మీనారాయణమ్మ అనే మహిళ రూ.40 లక్షల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ డ్వాక్రా మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.

దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీనారాయణమ్మ గురువారం ప్రవీణ్‌ ఇంటి వద్దకు వెళ్లి మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఏదైనా ఉంటే తన ఇంటి వద్దకు రమ్మని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవీణ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారన్నారు. దీంతో డ్వాక్రా మహిళలు ఆయన ఇంటి వద్దకు  వెళ్లారని తెలిపారు.  ‘ధైర్యం ఉంటే లోపలికి రండి..’ అంటూ ప్రవీణ్‌ మరోమారు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిందన్నారు. 

మరిన్ని వార్తలు