మాట వినడం లేదని భార్య దారుణం.. భర్తకు పూటుగా మద్యం తాగించి.. ఆతర్వాత

31 Dec, 2021 08:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, దేవరకొండ (నల్లగొండ): నాలుగు ఎకరాల భూమిని తన పేరిట పట్టా చేయడం లేదని ఓ వివాహిత దారుణానికి తెగబడింది. మద్యంలో పురుగుల మందు కలిపి భర్తను మట్టుబెట్టింది. ఈ దారుణ ఘటన దేవరకొండ మండలం శేరిపల్లి పెద్దతండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. సీఐ బీసన్న, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్‌ మోతీలాల్‌(45) భార్య లలితతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం.

గొడవపడి వేర్వేరుగా..
దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటుండడంతో లలిత ఆరేళ్లుగా పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని గుర్రంగూడలో నివాసం ఉంటోంది. అక్కడే కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటుండగా మోతీలాల్‌ స్వగ్రామంలోనే వ్యవసాయం, కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. 

బంధువుల శుభకార్యానికి వచ్చి..
కాగా, మోతీలాల్‌ పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిని తన పేరిట చేయాలని కొంతకాలంగా లలిత కోరుతోంది. ఇదే విషయం ఇద్దరి మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి.  కాగా బుధవారం స్వగ్రామమైన శేరిపల్లి పెద్ద తండాలో బంధువులు శుభకార్యానికి లలిత హైదరాబాద్‌ నుంచి వచ్చింది. రాత్రి సమయంలో ఇదే అదునుగా భావించిన లలిత మద్యంలో పురుగుల మందు కలిపి భర్తకు తాగించింది. దీంతో మోతీలాల్‌ మృతిచెందాడు. 

అతిగా మద్యం తాగి మృతిచెందాడని..
కాగా, గురువారం తెల్లవారుజామున లలిత బోరున విలపిస్తుండడంతో ఇరుగుపొరుగు వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీయగా అతిగా మద్యం తాగి తన భర్త మోతీలాల్‌ మృతిచెందాడని తెలిపింది. లలిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు నిలదీయడంతో మద్యంలో పురుగుల మందు కలిపి హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. హైదరాబాద్‌లో లలిత మరొకరితో సఖ్యతగా మెలుగుతూ మోతీలాల్‌ను మట్టుబెట్టిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సమాచారం మేరకు సీఐ బీసన్న ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడు శివరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ బీసన్న పేర్కొన్నారు. కాగా, నేరం అంగీకరించిన నిందితురాలు లలితను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. 

 చదవండి: గిట్టనివారు చేతబడి, మంత్రాలు చేస్తున్నారని.. మూడేళ్లలో..

మరిన్ని వార్తలు