ఆ డ్రగ్స్‌ను ఎవరు, ఎక్కడి నుంచి తెచ్చారు?

16 Apr, 2022 04:15 IST|Sakshi

రెండోరోజూ పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసు నిందితుల విచారణ  

బంజారాహిల్స్‌: పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ పార్టీలో ప్రధాన నిందితులుగా ఉన్న పబ్‌ భాగస్వామి ఉప్పల అభిషేక్, మేనేజర్‌ అనిల్‌ కుమార్‌లను గురువారం కస్టడీకి తీసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు రెండోరోజైన శుక్రవారం కూడా ప్రశ్నించారు. నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు విభాగం ఏసీపీ నర్సింగ్‌రావు, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్, లంగర్‌హౌస్‌ డీఐ భాస్కర్‌రెడ్డి, హుమాయున్‌నగర్‌ డీఐ కోటేశ్వర్‌రావు, బంజారాహిల్స్‌ డీఐ హఫీజుద్దీన్, బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావులతో కూడిన బృందం వీరిని 4 గంటలపాటు విచారించింది.

డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? ఎవరెవరికి సరఫరా చేశారు..? ఆ రోజు ఎవరెవరు తీసుకున్నారు..? అన్న కోణంలో ప్రశ్నలు సంధించగా తమకు తెలియదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. పబ్‌లో డ్రగ్స్‌ తీసుకొని పారేసిన వందలాది సిగరెట్‌ పీకలను సీజ్‌ చేసిన పోలీసులు వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో కూడా ప్రశ్నించారు. ఇద్దరి మొబైల్‌ ఫోన్లలో ఉన్న పలువురు మాదకద్రవ్యాల విక్రేతల నంబర్లను బట్టి గోవా, ముంబై, నైజీరియా నుంచి కొకైన్‌ తీసుకొచ్చి పబ్‌లో అమ్ముతున్నట్లుగా గుర్తించి ఆ దిశలోనే వీరిని ప్రశ్నించారు.

ఈ పబ్‌ ప్రధాన భాగస్వాములు వీరమాచినేని అర్జున్, కిరణ్‌రాజ్‌ల పాత్రపై కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారు. పార్టీలు ఏర్పాటు చేసినప్పుడు ఈ నలుగురు తలా కొంత మందిని పబ్‌కు పంపిస్తున్నట్లుగా, వీరికి సినీతారలు, సంపన్న వర్గాల పిల్లలతో సత్సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఇద్దరు నిందితులను మరో రెండురోజులపాటు పోలీసులు విచారించనున్నారు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మరిన్ని వార్తలు