డేటింగ్‌ యాప్‌తో వల, డ్రగ్స్‌ ఇచ్చి 16మందిని

5 Feb, 2021 14:35 IST|Sakshi

ఖిలేడి.. మత్తులో ముంచి 16 మందిని దోచేసింది

ముంబై: ఆన్‌లైన్‌.. సోషల్‌ మీడియా వేదికగా జరిగే మోసాల గురించి ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా జనాలు పెద్దగా ఖాతరు చేయడం లేదు. ప్రొఫైల్‌ పిక్‌ అమ్మాయి కనిపిస్తే చాలు.. వెనకాముందు చూడకుండా వారితో మాట కలపడం.. ఆ మాయలో పడి భారీగా మోసపోయి.. అప్పుడు కళ్లు తెరిచి.. జరిగిన మోసాన్ని గుర్తించి లబోదిబోమనడం ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యింది. తాజాగా ఈ కోవలోకి మరో ఖిలేడి వచ్చి చేరింది. డేటింగ్‌ యాప్‌ ద్వారా మగాళ్లకు వల వేయడం.. చిక్కిన వారికి డ్రగ్స్‌ ఇచ్చి దోచేయడం పనిగా పెట్టుకుంది. అలా ఏడాది కాలంగా 16 మందిని దోచేసింది. చివరకు ఓ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఆమెని అరెస్ట్‌ చేశారు.

వివరాలు.. బీసీఏ డ్రాపౌట్‌ అయిన నిందితురాలు ఓ మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీలో పని చేసేది. అయితే లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగం కోల్పోయింది. దాంతో ఇంటికే పరిమితమైన నిందితురాలు ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్స్‌ టిండర్‌, బంబుల్‌లో తన ప్రొఫైల్‌ని అప్‌లోడ్‌ చేసింది. యాప్‌ ద్వారా పరిచయమైన మగాళ్లను తన మాటలతో మాయ చేసేది. ఆ తర్వాత వారిని కలుసుకోవాలని ఉందంటూ హోటల్‌కి రప్పించేది. వచ్చని వారికి మత్తు మందు కలిపిన డ్రింక్స్‌ ఇచ్చి.. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకునేది. ఇలా ఇప్పటివరకు దాదాపు 16 మందిని ముంచింది. ఈ క్రమంలో ఆశిష్‌ కుమార్‌ అనే బాధితుడు కూడా నిందితురాలి వలలో పడి.. పుణెలోని ఓ హోటల్‌లో ఆమెని కలుసుకునేందుకు వెళ్లాడు. నిందితురాలు అతడికి మత్తు మందు కలిపిన ‌డ్రింక్‌ ఇచ్చి.. అతడి వద్ద ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలతో ఉడాయింది. (చదవండి: చూసీ చూడనట్లు వదిలేయొద్దు..)

మెలకువ వచ్చి చూసిని ఆశిష్‌కి డబ్బు, బంగారం మాయమవ్వడం.. నిందితురాలు కనిపించకపోవడంతో జరిగిన మోసం పూర్తిగా అర్థం అయ్యింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఖిలేడి వ్యవహారం బట్టబయలైంది. ఆశిష్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 15.25 లక్షల విలువైన బంగారం, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు