సిద్ధూ ప్రమాణస్వీకారంలో అపశ్రుతి: ముగ్గురి మృతి

23 Jul, 2021 15:21 IST|Sakshi
ప్రమాదంతో నుజ్జునుజ్జయిన బస్సులు (ఫొటో: India Today)

ఛండీఘడ్‌: కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రమాణస్వీకారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్తున్న కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కార్యకర్తలు ప్రయాణిస్తున్న బస్సు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన తనను కలచి వేసిందని పార్టీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్‌ సింగ్‌ శుక్రవారం ఉత్సాహ వాతావరణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలా నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మోగ జిల్లాలోని లోహరా గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఛండీఘర్‌లో జరిగే సిద్ధూ కార్యక్రమానికి మినీ బస్సులో బయల్దేరారు. మార్గమధ్యలో 

మార్గమధ్యలో ఆర్టీసీ బస్సును వీరి బస్సు వేగంగా ఢీకొట్టింది. మినీ బస్సు నుజ్జునుజ్జయ్యింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. తీవ్ర గాయాలవడంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు