Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్!

9 May, 2021 08:43 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును తాము అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసు కొచ్చారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేశారు.

దీనిపై రామగుండం పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తొలుత ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. అలాగే పోలీసులు మధు అదృశ్యాన్ని ధ్రువీకరించకపోవడం, టీఆర్‌ఎస్‌ నేతల రాయబారాలు, మధు సతీమణి శైలజ స్పందన తదితర విషయాలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో శనివారం మధును అదుపులోకి తీసుకున్ననట్లు పోలీసులు తెలిపారు.  

మహారాష్ట్రలో చిక్కని మధు 
వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును తిరిగి తవ్వుతున్నారనే విషయం గత నెల 29న పుట్ట మధుకు తెలిసింది. దాంతో అదేరోజు రాత్రి ఆయన గన్‌మేన్లు లేకుండా, ప్రభుత్వ కారును ఇంట్లోనే వదిలేసి తన భార్య, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ శైలజ కారులో అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మధు ‘గాయబ్‌’అయ్యారనే విషయాన్ని గోప్యంగా ఉంచి దర్యాప్తు ప్రారంభించారు. వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించి ఎట్టకేలకు మధు ఆచూకీ కనుకొన్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లా వని పట్టణంలోని తన సోదరుడి ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని ఈనెల 1న అక్కడి పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అయితే మధు అక్కడ పోలీసులకు చిక్కలేదు. ఈ మేరకు మరాఠీ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. అదే సమయంలో ఈటల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన మధు హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ లభించలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం వెళ్లి ఉంటారనేది ఓ కథనం.. కాగా మధు హైదరాబాద్‌లోనే ఉండి తన భార్య సహకారంతో ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారని, అదే సమయంలో పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంటారనేది మరో కథనం.

అయితే హైదరాబాద్‌లో పట్టుకున్నట్లు కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు సీన్‌ క్రియేట్‌ చేశారని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి భీమవరం వెళ్లి, శనివారం ఉదయాన్నే మధును అదుపులోకి తీసుకొని, మధ్యాహ్నానికల్లా జెట్‌ స్పీడ్‌లో రామగుండం తీసుకొచ్చి విచారణ ప్రారంభించడం ఈ సందేహానికి తావిస్తోంది. హైదరాబాద్‌లో ఉంటే ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే భీమవరం ఎపిసోడ్‌కు తెరతీశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

కిషన్‌రావు ఫిర్యాదుతోనే దర్యాప్తు వేగం 
ఈ జంట హత్యల కేసులో ప్రధాన నిందితులకు పుట్ట మధు రూ.2 కోట్లు సుపారీ ఇచ్చారని, ప్రధాన నిందితుడు కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణం వేగంగా జరుగుతోందని, దీని వెనకాల జెడ్పీ చైర్మన్‌ ఉన్నారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఈనెల 16న ఐజీ నాగిరెడ్డికి పిర్యాదు చేశారు. ఈ కేసును హైకోర్టు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న క్రమంలో కిషన్‌రావు ఫిర్యాదుపై ఐజీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఎ–1 కుంట శ్రీను ఇంటి నిర్మాణం వెనక ఎవరెవరున్నారనే కోణంలో కూడా విచారణ జరిపారు. హత్య కోసం రూ.2 కోట్లు సుపారీ ఇచ్చారా? అంతమొత్తం ఎక్కడ నుంచి వచ్చింది..? దీని వల్ల ఎవరికి ప్రయోజనం అనే కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో పుట్ట మధు అదృశ్యం కావడంతో కేసు మలుపు తిరిగింది.  

హత్యల కేసులో పాత్ర తేల్చేందుకే.. 
హైకోర్టు లాయర్ల హత్య కేసులో పుట్ట మధు ప్రమేయం తేల్చేందుకు శనివారం ఆయన్ను ఇక్కడికి తీసుకువచ్చాం. ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో విచా రణ కొనసాగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితుని ఇంటి పనులు వేగవంతం కావడం, వారం రోజుల పాటు మధు ఎందుకు అదృశ్యం అయ్యారు? తదితర వివరాలు విచారణలో తెలుస్తాయి. కిషన్‌రావు ద్వారా కూడా ఆధారాలు సేకరిస్తాం. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.  – వి.సత్యనారాయణ, రామగుండం పోలీస్‌ కమిషనర్‌

దొరకని ‘పెద్దల’ అపాయింట్‌మెంట్‌
టీఆర్‌ఎస్‌ వర్గాల సమాచారం ప్రకారం.. పుట్ట మధు మహారాష్ట్ర నుంచి నేరుగా హైదరాబాద్‌ వచ్చాడు. ఈ కేసు నుంచి బయటకు తీసుకురావాలని ఆయన జిల్లాకు చెందిన ఓ మంత్రి సాయం కోరాడు. అయితే ఆయన టీఆర్‌ఎస్‌ పెద్దలతో మాట్లాడి పుట్ట మధుకు అపాయింట్‌మెంట్‌ ఇప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడం, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వార్తలు రావడంతో పరిస్థితి మారింది. మధు సతీమణి పుట్ట శైలజ సీన్‌లోకి వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లినా వీలు కాలేదు. దీంతో మరో మంత్రిని కలిసి సాయం కోరారు. ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతున్న క్రమంలోనే పోలీసులు మధును అదుపులోకి తీసుకొని రామగుండం తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి ఫైనల్‌ చార్జిషీట్‌ దాఖలు చేయాలని భావిస్తున్నారు.  

చదవండి: Putta Madhu: వారం రోజులుగా వీడని సస్పెన్స్‌.. అసలేం జరిగింది?

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు