హైదరాబాద్‌లో హెరాయిన్‌ తయారీ?

3 Apr, 2022 04:04 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న పాపి స్ట్రా కాన్సన్‌ట్రేట్‌ను పరిశీలిస్తున్న రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ (ఫైల్‌) 

పాపి స్ట్రా కాన్సన్‌ట్రేట్‌ పట్టుబడటంతో అనుమానాలు

ముడి పాపి స్ట్రా కాన్సన్‌ట్రేట్‌కు రసాయనాలు కలిపితే మార్ఫిన్‌ తయారీ.. మరింత కెమికల్‌ కలిపితే ఖరీదైన హెరాయిన్‌ సిద్ధం!

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో హెరాయిన్‌ను తయారు చేస్తున్నారా? మూతపడిన ఫార్మా పరిశ్రమలను ఇందుకు కేంద్రంగా మార్చుకుంటున్నారా? నగరంలో పెరుగుతున్న డ్రగ్స్‌ డిమాండ్‌ను ఆధారంగా చేసుకుని అక్రమార్జనపై దృష్టి పెట్టారా? అనే కోణంలో రాచకొండ పోలీసుల దర్యాప్తు మొదలైంది. ఇప్పటివరకు గోవా, బెంగళూరు, ముంబై ప్రాంతాల నుంచి నిందితులు అక్రమ మార్గాల ద్వారా హెరాయిన్‌ను దిగుమతి చేసి నగరంలో విక్రయించేవాళ్లు.

కానీ తాజాగా హెరాయిన్‌ను తయారు చేసేందుకు అవసరమైన ముడిపదార్థం ‘పాపి స్ట్రా కాన్సన్‌ట్రేట్‌’ను తరలిస్తున్న ఇద్దరు పంజాబీలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో స్థానిక కస్టమర్లకు పాపి స్ట్రానే విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపినా.. ఇది ఎవరి నుంచి కొనుగోలు చేశారు? ఎవరికి విక్రయిస్తున్నారనే కోణంలో కూపీ లాగుతున్నారు.

సరిగ్గా ఏడాది క్రితం మహేశ్వరంలో పాపి స్ట్రాకాన్సన్‌ట్రేట్‌ మొక్కలను పెంచుతున్న పలువురు నిందితులను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు పంజాబ్‌ నుంచి నగరానికి పాపిస్ట్రాను తరలిస్తూ ఇద్దరు పట్టుబడటంతో పోలీసుల్లో అనుమానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో పాపి స్ట్రా డ్రగ్‌ పట్టుబడటం ఇదే తొలిసారి కాగా.. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రంజిత్‌సింగ్‌ను పట్టుకుంటే విలువైన సమాచారం బయట పడుతుందని భావిస్తున్నారు.

సెల్‌ఫోన్‌ కాంటాక్టుల పరిశీలన
మేడ్చల్‌లోని కండ్లకోయ టోల్‌ ప్లాజా వద్ద దాబా నిర్వహిస్తున్న ఇద్దరు పంజాబీలు జగ్తార్‌ సింగ్, జైమాల్‌ సింగ్‌ల నుంచి రూ.15 లక్షల విలువ చేసే పాపి స్ట్రా కాన్సన్‌ట్రేట్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇప్పటివరకు ఎంత మందికి విక్రయించారు? కొనుగోలుదారులు ఎవరనేది విచారించేందుకు సిద్ధమవుతున్నారు. నిందితుల సెల్‌ఫోన్లలోని కాంటాక్ట్‌లు, వారి సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నట్లు ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు.

మందుల తయారీకి ‘పాపి స్ట్రా’ పెంపకం
పంజాబ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో పాపి స్ట్రా మొక్కల పెంపకానికి కేంద్రం లైసెన్స్‌ ఇచ్చిందని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. అయితే దీన్ని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) పర్యవేక్షణలోనే పెంచాల్సి ఉంటుంది. కాపుకొచ్చాక మొక్కలోని ఓపియం, ఇతరత్రా భాగాలను మందుల తయారీలో వినియోగిస్తుంటారు.

అయితే ముడి పాపి స్ట్రా కాన్సన్‌ట్రేట్‌కు కొన్ని రకాల రసాయనాలను కలిపితే ముందుగా మార్ఫిన్, ఆ తర్వాత మరికొంత కెమికల్‌ కలిపితే ఖరీదైన హెరాయిన్‌ తయారవుతుందని పోలీసు అధికారి వివరించారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో గ్రాముకు రూ.9–10 వేలుగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మూతపడిన ఫార్మా పరిశ్రమల్లో హెరాయిన్‌ తయారీ ఏమైనా జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర మాదక ద్రవ్యాలతో పోలిస్తే పాపి స్ట్రాలో మత్తు గాఢత తక్కువగా ఉంటుంది.  

మరిన్ని వార్తలు