క్రికెట్‌ బెట్టింగ్‌...ఏడుగురు అంతరాష్ట్ర నిందితులు అరెస్టు

7 Apr, 2022 08:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పుదుచ్చేరిలోని యానాం కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రధాన బుకీ సీహెచ్‌ సాయిరామ్‌ వర్మ పరారీలో ఉండగా.. ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను ఎల్బీనగర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాచకొండ ఎస్‌ఓటీ డీసీపీ మురళీధర్, ఇన్‌స్పెక్టర్‌ బీ అంజిరెడ్డిలతో కలిసి రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు.  

  • ప్రకాశం జిల్లాకు చెందిన తన్నీరు నాగరాజు 2016లో క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో వనస్థలిపురం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తన వైఖరి మార్చుకోలేదు. తాజాగా ఐపీఎల్‌ జరుగుతున్న నేపథ్యంలో.. మెయిన్‌ బుకీ సాయిరామ్‌ వర్మతో చేతులు కలిపి హైదరాబాద్‌ కేంద్రంగా బెట్టింగ్స్‌ మొదలుపెట్టాడు. తన స్నేహితుడైన కృష్ణా జిల్లా, చింతకుంటపాలెం గ్రామానికి చెందిన గుండు కిశోర్‌ను రెండు నెలల పాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేయాలని ఇందుకు నెలకు రూ.50వేల కమీషన్‌ ఇస్తానని చెప్పి నగరానికి తీసుకొచ్చాడు. తన బంధువులైన  ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన తన్నీరు అశోక్, చెమ్మేటి వినోద్‌లను సబ్‌ బుకీలుగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలో వినోద్‌ ఇంట్లో బెట్టింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. 
  • మ్యాచ్‌ మొదలు మూడు లైన్ల ద్వారా సబ్‌ బుకీలు పందేలు కాసే పంటర్లకు ఆన్‌లైన్‌లో లింక్‌లు పంపేవారు. మ్యాచ్‌ పరిస్థితిని బట్టి పంటర్లు రూ.10–50 వేల మధ్య పందేలు కాస్తుంటారు. ప్రతి బెట్టింగ్‌కు సబ్‌ బుకీలు రేటింగ్స్‌ ఇస్తుంటారు. మ్యాచ్‌ పూర్తయ్యాక.. ఏ పంటర్ల నుంచి ఎంత సొమ్ము వసూలు చేయాలి, ఎంత చెల్లించాలో బుకీలు ఏజెంట్లకు సూచిస్తారు. మొత్తం లాభంలో సబ్‌ బుకీలకు 3 శాతం కమీషన్‌గా ఇచ్చేవారు.  ఆన్‌లైన్‌లో పందేలు కాసేవారి కోసం సాయిరామ్‌ వర్మ ‘రోమన్‌ క్యాథలిస్ట్‌ కులమదై స్వామి’ అనే పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్‌లో నకిలీ ఖాతాను తెరిచాడు.  
  • గురువారం జరిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌పై క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు.. సత్యానగర్‌ కాలనీలోని స్థావరంపై దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. సబ్‌ బుకీలు నాగరాజు, కిశోర్, అశోక్, వినోద్‌లతో పాటు పంటర్లు చైతన్యపురీకి చెందిన కోట్ల దినేష్‌ భార్గవ్, కొత్తపేటకు చెందిన మేడిశెట్టి కిశోర్, శంకర్‌పల్లికి చెందిన బోజన రాజులను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.11.80 లక్షల నగదు, బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.31,17,576 సొమ్ముతో పాటు 9 ఫోన్లు, కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.  

(చదవండి: తుపాకీ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు)

మరిన్ని వార్తలు