గసగసాల సాగు ముసుగులో ఓపీఎం

24 Sep, 2020 09:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గసగసాల సాగు కోసం అనుమతి పొందిన కొందరు రాజస్థాన్‌ రైతులు దాని ముసుగులో ఓపీఎంగా పిలిచే నల్లమందు తయారు చేస్తున్నారు. దీన్ని దేశంలోని వివిధ నగరాలకు అక్రమంగా రవాణా చేసి రహస్యంగా విక్రయిస్తున్నారు. అక్కడి భిన్‌మాల్‌ జిల్లా నుంచి సిటీకి స్మగ్లింగ్‌ చేసుకొచ్చిన నల్లమందును అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 150 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి బుధవారం వెల్లడించారు.

నిర్ణీత ప్రాంతాల్లో కొందరికే అనుమతి... 

 • నల్లమందు తయారు చేయడానికి ఉపకరిస్తుందనే కారణంగా దేశంలో గసగసాల సాగుపై నిషేధం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ల్లో ఉన్న కొందరు రైతులకు మాత్రమే దీన్ని సాగు చేసేందుకు అనుమతి ఇస్తుంటుంది.  
 • ప్రస్తుతం ఈ రైతుల సంఖ్య 25 వేలలోపే ఉంది. ఒక్కో రైతు సాలీనా 54 కిలోలు మాత్రమే పండించడానికి అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సాగుపై నిత్యం నిఘా ఉంచుతుంది.  
 • అనుమతి పొందిన రైతుల్లో కొందరు రాజస్థాన్‌లోని భిన్‌మాల్‌ జిల్లా పోనస గ్రామంలోనూ ఉన్నారు.  
 • ఇదే గ్రామానికి చెందిన దినేష్‌ కుమార్‌ ఆరేళ్ల క్రితం బతుకుతెరువు కోసం సిటీకి వచ్చాడు. కాప్రాలో నివసిస్తున్న ఇతగాడు నాగోల్‌ ప్రాంతంలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. ఇతడికి నల్లమందు వినియోగించే అలవాటు ఉంది. 

గసగసాల కాయల నుంచి తయారీ... 

 • లాక్‌డౌన్‌తోపాటు తదనంతర పరిణామాల నేపథ్యంలో దినేష్‌ జీవనోపాధి కోల్పోయాడు. దీంతో తన స్వరాష్ట్రం నుంచి నల్లమందు తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తే మంచి లాభాలు వస్తాయని భావించాడు. ఈ విషయాన్ని తమ ప్రాంతంలో ఉన్న కొందరు గసగసాల రైతులతో భికారామ్‌ ఒప్పందం చేసుకున్నాడు.  
 • ఈ రైతులు తమ పొలాల్లోని గసగసాల కాయ ముదిరిన తర్వాత దానిపై బ్లేడుతో గాట్లు పెట్టేవాళ్లు. దాని నుంచి కారే నల్లని ద్రవాన్ని సేకరించి తమ ఇంట్లోనే పొయ్యిపై కాస్తారు. దీంతో అది చిక్కగా, నల్లని పేస్టులా ఉండే నల్లమందు తయారవుతుంది.  
 • దాదాపు కేజీ నల్లమందును తీసుకున్న ఇతగాడు ఈ నెల మొదటి వారంలో ప్రైవేట్‌ బస్సులో హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పటి నుంచి ఈ డ్రగ్‌కు బానిసలైన వారికి గ్రాము నల్లమందు రూ. 1400 నుంచి రూ. 1600 వరకు విక్రయించాడు. దీనిపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం వలపన్నారు. 

హెరాయిన్‌ తయారీకి వినియోగం... 

 • సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్‌ఐలు వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థక్రుద్దీన్‌ తమ బృందాలతో నల్లకుంట ప్రాంతంలో కాపుకాశారు. తన ద్విచక్ర వాహనంపై అటుగా వస్తున్న దినేష్‌ను ఆపి తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే అతడి వాహనంలో ఉన్న 150 గ్రాముల నల్లమందు దొరికింది. 
 • ఈ డ్రగ్‌కు బానిసైన వారిలో యువత, విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు దినేష్‌ కుమార్‌ ఈ డ్రగ్‌ను ఎవరెవరికి అమ్మాడు అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. 
 • ఈ నల్లమందును అంతర్జాతీయ మార్కెట్‌లో స్మగ్లర్లు భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తుంటారు. 
 • దీన్ని ప్రాసెస్‌ చేయడం ద్వారా హెరాయిన్‌ సైతం తయారు చేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి డ్రగ్స్‌ దందాల విషయం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్‌ 
కూకట్‌పల్లి: గంజాయిని విక్రయిస్తున్న నలుగురిని మాదాపూర్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వివరాలివీ... గుంజా నవీన్‌కుమార్, కేశవరాపు ఆనంద్‌ మానేశ్వర్, పాలికే అనంత్‌ కుమార్, ఆస్కా శ్రావణ్‌ గంజాయి ప్యాకెట్లతో అనుమానస్పదంగా కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌ వద్ద తిరుగుతుండగా మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులను వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కేశవరపు ఆనంద్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకొచ్చి తమకు అందజేస్తాడని దానిని తాము హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు వారు తెలిపారు. వారి నుంచి 3.5 కేజీల గంజాయి పొడి ప్యాకెట్లను, 4 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకొని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా