ప్రైవేట్‌ పాఠాల పేరుతో పిల్లల తండ్రులకు గాలం, ఆపై ‘కట్నం’ పేరిట బ్లాక్‌మెయిలింగ్‌..

22 Mar, 2022 18:43 IST|Sakshi

హనీట్రాప్‌ ఉదంతాలు ఎన్ని వెలుగు చూస్తున్నా.. వాటిలో కొన్ని మాత్రం విషాదాంతాలుగా మిగులుతుంటాయి. తాజాగా రాజస్థాన్‌లో డబ్బు కోసం వెంపర్లాడిన ఓ ట్యూషన్‌ టీచర్‌ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. తన అందంతో ఓ వ్యాపారవేత్తకు వల వేసిన ఆమె.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడంతో కుటుంబంతో కలిసి హత్య చేశాడు ఆ వ్యక్తి. ఆపై కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. 

రాజస్థాన్‌ అల్వార్ జిల్లాలోని తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో.. మార్చి 16న వంతెన కింద గోనె సంచిలో యువతి మృతదేహం కలకలం సృష్టించింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సదరు యువతి పేరు ప్రియాంక(29) అని, ఢిల్లీ నుంచి వలస వచ్చిందని తెలిసింది. ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తుండడంతోపాటు స్థానిక వ్యాపారవేత్త కపిల్ గుప్తా ఇంటికి వెళ్లి పిల్లలకు ప్రైవేట్‌ పాఠాలు చెప్తుండేది. ఈ క్రమంలో ప్రియాంక అందానికి ఫిదా అయిన కపిల్‌.. ఆమెతో స్నేహం, ఆపై అనైతిక సంబంధం ఏర్పరుచుకున్నాడు. 

‘కట్నం’ కోసం బ్లాక్‌మెయిలింగ్‌
తనతో సంబంధాన్ని సాకుగా చేసుకుని.. ప్రియాంక, కపిల్‌పై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. తనకు పెళ్లి కుదిరిందని, వరుడి కుటుంబానికి రూ.50 లక్షలు కట్నం ఇవ్వాలని, అందుకు డబ్బు ఇవ్వాలంటూ కపిల్‌పై ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో భరించలేకపోయిన కపిల్‌.. అసలు విషయం భార్యకి, తన బావమర్దులకు చెప్పి ప్రియాంకను ట్రాప్‌ చేశాడు. డబ్బు కోసం గుడ్డిగా నమ్మివచ్చిన ప్రియాంకను హత్య చేసి.. గోనె సంచిలో కుక్కేసి తాతర్‌పూర్‌ బ్రిడ్జి కింద పడేశాడు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. సోమవారం కపిల్‌తో పాటు ఆయన భార్య, ఆమె ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా.. ప్రియాంక ఇదే తరహా హానీ ట్రాపింగ్‌తోనే ఎనిమిది మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రైవేట్‌ ట్యూషన్‌ పేరుతో ఇళ్లలోకి చేరి.. ఆపై పిల్లల తండ్రులకు వలపు గాలం వేసేదని, అటుపై వాళ్లను బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు గుంజేసి ఆ డబ్బుతో ఆమె జల్సాలు చేసేదని పోలీసులు నిర్ధారించుకున్నారు.

మరిన్ని వార్తలు