నాలుగేళ్ల తర్వాత గల్ఫ్‌ నుంచి ఇంటికి.. 24 గంటలు గడవకముందే..

7 Dec, 2021 20:59 IST|Sakshi
ఇండియాకు వచ్చే ముందు ఎయిర్‌పోర్టులో టీ తాగుతున్న రాజేశ్‌ (ఫైల్‌) 

గల్ఫ్‌ నుంచి ఇంటికి వచ్చి 24 గంటలు కాక ముందే.. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు 

చికిత్స పొందుతూ కన్నుమూత

సాక్షి, నిజామాబాద్‌(కమ్మర్‌పల్లి): ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన ఓ యువకుడు నాలుగేళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులతో మనసారా ముచ్చటించకుండానే మృత్యు ఒడికి చేరాడు. కమ్మర్‌పల్లి మండలం కోనాసముందర్‌ గ్రామానికి చెందిన యాట రాజేశ్‌ (35)కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్‌ బాట పట్టాడు.

చదవండి: (విధి వక్రించి భర్త, తండ్రి మృతి.. చంటితో సహజీవనం.. అంతలోనే..)

సౌదీ అరేబియా వెళ్లిన అతడు నాలుగేళ్ల తర్వాత గత నెల 27న అర్ధరాత్రి 12 గంటలకు స్వగ్రామం కోనాసముందర్‌కు వచ్చాడు. తర్వాతి రోజు (ఆదివారం) ఉదయం నుంచి కుటుంబ సభ్యులతో గడిపిన రాజేశ్‌ సాయంత్రం వేళ బైక్‌పై బయటకు వెళ్లాడు. నర్సాపూర్‌ వెళ్లే మార్గంలో రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపై కప్పిన తాటిపత్రాలు లేవకుండా బండరాయి పెట్టారు. అయితే, చీకట్లో బండరాయి కనిపించక పోవడంతో దాన్ని ఢీకొని రాజేశ్‌ రోడ్డుపై ఎగిరి పడ్డాడు.

చదవండి: (టిఫిన్‌ సెంటర్‌ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..)

తలకు తీవ్ర గాయాలవడంతో కుటుంబ సభ్యులు భీమ్‌గల్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందాడు. నాలుగేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన రాజేశ్‌ తమతో మనసారా మాట్లాడకుండానే మృత్యు ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డుపై వడ్లు ఆరబోసి ప్రమాదానికి కారణమైన రైతుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు