ఉన్నత ఉద్యోగం వచ్చిన ఏడాదికే.. ఊడింది!

8 Jul, 2021 17:11 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ (ఎస్పీసీఏ) ప్యానెల్‌లో ఉద్యోగం పొందిన ఏడాది తరువాత, క్రిమినల్ నేపథ్యం ఉన్నందుకు రాజ్‌కుమార్ ధాకనే ఉద్యోగాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. హోంశాఖ నిర్వహించిన విచారణలో 2015 ఏప్రిల్‌లో ఆయన హత్యాయత్నానికి పాల్పడినట్లు తేలింది. అంతేకాకుండా అతనిపై మరో కేసు కూడా నమోదైంది. 2020 జూలై 14న, హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేయగా.. ధాకనేకు సివిల్‌ సొసైటీ నుంచి ప్యానెల్ ప్రముఖ సభ్యునిగా నియమించింది. దీని తరువాత చాలా మంది ఆయన నియామకాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.

హోంశాఖ దర్యాప్తు చేసి డీజీపీ ద్వారా నివేదిక సమర్పించింది. ధాకనేపై తీవ్రమైన నేరాలు నమోదయ్యాయని, దీని ఆధారంగా అతన్ని అధికారం నుంచి తొలగించారని నివేదిక పేర్కొంది. కాగా, 2015 ఏప్రిల్‌లో పూణేలోని కోరెగావ్ పార్క్ పోలీస్ స్టేషన్ వద్ద పార్కింగ్ అటెండెంట్‌ను కొట్టినట్లు ఆరోపణలు రావడంతో.. హత్యాయత్నం ఆరోపణలపై ధాకనేపై కేసు నమోదైంది. పోలీసు అధికారులపై డీజీపీ హోదా నుంచి కానిస్టేబుల్ వరకు పౌరులు ఫిర్యాదు చేయడానికి వీలుగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్పీసీఏ ఏర్పాటు చేశారు. దీని ద్వారా సెషన్స్ కోర్టుకు సమానంగా విచారణ జరుగుతుంది.

మరిన్ని వార్తలు