చౌళూరు హత్యకేసు దర్యాప్తు ముమ్మరం 

11 Oct, 2022 03:37 IST|Sakshi
రామకృష్ణారెడ్డి (ఫైల్‌)

వరుణ్‌ అలియాస్‌ మంజుపై అనుమానాలు 

మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

వీఆర్‌కు రూరల్‌ సీఐ, ఎస్‌ఐ  

హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు హంతకుల కోసం వేట సాగిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటకలోను గాలిస్తున్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో అనుమానమున్న వస్తువులు, వేలిముద్రలను క్లూస్‌ టీం సేకరించింది. తనిఖీల్లో వేటకొడవలి పిడి కూడా దొరికింది.

సంఘటన జరిగిన వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చౌళూరు గ్రామానికే చెందిన నేరచరిత్ర కలిగిన వరుణ్‌ అలియాస్‌ మంజు పాత్ర ఉందేమోనన్న కోణంలోను దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్య జరిగినప్పటి నుంచి వరుణ్‌ అజ్ఞ్తాంలోకి వెళ్లిపోయాడు. రామకృష్ణారెడ్డి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు, రాజకీయ విభేదాలు, ధాబా పునరుద్ధరణ విషయంలో తలెత్తిన సమస్యలు తదితర అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇది సుపారీ హత్యనా అనే కోణంలోను దర్యాప్తు సాగిస్తున్నారు. ఇటీవల రామకృష్ణారెడ్డి రాజకీయంగానే కాకుండా బెంగళూరులో వ్యాపారపరంగాను కొంత బిజీగా ఉంటూ వచ్చారు. తన ధాబా వద్ద బార్‌ ఏర్పాటు చేసేందుకు పనులు చేపడుతున్నారు. ఈ విషయంలో ఆయనకు వరుణ్‌తో గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బార్‌ కూడా ప్రారంభిస్తే రామకృష్ణారెడ్డి ఆర్థికంగా మరింత బలంగా తయారవుతారన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు మాత్రం రాజకీయంగా వ్యతిరేకులే హత్యకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైతే స్పష్టమైన కారణాలేవీ తెలియడంలేదు. సమగ్ర దర్యాప్తు కొనసాగించి నిజాలు తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. 

రూరల్‌ సీఐ, ఎస్‌ఐలపై శాఖాపరమైన చర్యలు 
హిందూపురం అప్‌గ్రేడ్‌ రూరల్‌ పోలీసుస్టేషన్‌ సీఐ జి.టి.నాయుడు, ఎస్‌ఐ కరీంలను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ ఉత్తర్వులిచ్చారు. చౌళూరు రామకృష్ణారెడ్డి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపినా  రక్షణ కల్పించలేదన్న కారణంతో వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. విచారణాధికారిగా టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లును నియమించారు. ఆయన రూరల్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌గాను వ్యవహరిస్తారు.   

మరిన్ని వార్తలు