Ranga Reddy: పెళ్లై రెండేళ్లవుతున్నా అక్క కాపురం చక్కబడటం లేదని.. 

9 May, 2022 13:07 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: పెళ్లి జరిగి రెండేళ్లవుతున్నా అక్క కాపురం చక్కబడటం లేదన్న మనస్తాపంతో తమ్ముడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన చేవెళ్ల మండలంలోని గుండాల అనుబంధ గ్రామమైన లక్ష్మీగూడలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. లక్ష్మీగూడకు చెందిన కొలన్‌ శేఖర్‌రెడ్డికి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి(30), కూతురు మాధవి ఉన్నారు. శ్రీకాంత్‌రెడ్డి డిగ్రీ వరకు చదువుకొని వ్యవసాయం చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మాధవికి రెండేళ్ల కిత్రం శంకర్‌పల్లి మండలం సింగపూర్‌ గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డితో వివాహం జరిపించారు.

కొంత కాలంగా అదనపుకట్నంతో పాటు భూమి కూడా ఇవ్వాలని భర్త నుంచి వేధింపులు పెరిగాయి. పలుమార్లు గ్రామ పెద్దల సమయంలో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. మాధవి ఆరోగ్యం కూడా క్షీణించడంతో అక్క జీవితం ఏమవుతుందోనని శ్రీకాంత్‌రెడ్డి మదనపడసాగాడు. ఈ క్రమంలో  శనివారం మధ్యాహ్నం స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు డ్రిప్‌ పైపుతో ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

మరిన్ని వార్తలు