తెల్లవారితే పెళ్లి.. తలుపు తీసి చూస్తే..

4 Jun, 2021 10:33 IST|Sakshi

సాక్షి, తలకొండపల్లి( రంగారెడ్డి జిల్లా): తెల్లవారితే.. పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన తలకొండపల్లి మండల పరిధిలోని మెదక్‌పల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన పట్టెబర్ల యాదమ్మ, లింగంగౌడ్‌ దంపతుల చిన్న కుమారుడు శ్రీకాంత్‌గౌడ్‌(26) గతంలో నగరంలో పనిచేస్తుండేవాడు. కొన్నిరోజల క్రితం గ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.

శుక్రవారం అతడి వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. కందుకూరు మండలం కొత్తగూడెంకు చెందిన ఓ యువతితో పెళ్లి చేసేందుకు 20 రోజుల కితం నిశ్చితార్థం కూడా చేశారు. అయితే, బుధవారం రాత్రి 10 గంటలకు శ్రీకాంత్‌గౌడ్‌ భోజనం చేసి తమ పాత ఇంట్లో నిద్రించాడు. గురువారం తెల్లవారుజామున అతడి అన్న ప్రభాకర్‌గౌడ్‌ వెళ్లి నిద్రలేపి అతడి వద్ద ఉన్న బైకు తాళంచెవి తీసుకొని పొలానికి వెళ్లాడు. మేడికొమ్మ తీసుకొచ్చి కొత్త ఇంట్లో పందిరి వేసేందుకు సిద్ధం చేశాడు.

తిరిగి 5 గంటలకు ప్రభాకర్‌గౌడ్‌ పాతఇంటికి వెళ్లి పెళ్లికొడుకును చేసేందుకు శ్రీకాంత్‌గౌడ్‌ను నిద్రలేపే యత్నం చేయగా అతడి నుంచి స్పందన రాలేదు. దీంతో తలుపులు విరగ్గొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు బోరుమన్నాడు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అతడి సెల్‌ఫోన్, ఆత్మహత్యకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బీఎస్‌ఎస్‌ వరప్రసాద్‌ తెలిపారు.  కాగా, శ్రీకాంత్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

అతడి ఇష్టం మేరకే పెళ్లి..
శ్రీకాంత్‌గౌడ్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అతడి అభీష్టం మేరకే.. అతను ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు మృతుడి సోదరుడు ప్రభాకర్‌ తెలిపాడు. శ్రీకాంత్‌గౌడ్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

చదవండి : 27 రోజులు.. 27 లక్షలు... ఐనా దక్కని ప్రాణం...!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు