ఆస్ట్రేలియా నుంచి నిత్యం వీడియో కాల్స్.. నగ్న వీడియోలు, ఫొటోలతో

4 Nov, 2021 02:05 IST|Sakshi
రామ్‌ కార్తీక్‌ ప్రగతి (ఫైల్‌) 

వీడియోలు బయటపెడతానని అదనపు కట్నంకోసం యువకుడి బెదిరింపు 

కట్నకానుకల విషయంలో పెద్దల గొడవ.. సంబంధం రద్దు

మనస్తాపంతో యువతి ఆత్మహత్య.. నిందితుడి అరెస్టు 

మహేశ్వరం: కాబోయే భార్య అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడి ఆమె ఆత్మహత్యకు కారకుడైన కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌ గ్రామానికి చెందిన జుట్టు రామ్‌ కార్తీక్‌ అలియాస్‌ రమేశ్‌ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసేవాడు. కార్తీక్‌కు మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో ఏడాది కిందట వివాహం నిశ్చయమైంది. అప్పటి నుంచి రామ్‌ కార్తీక్‌ ఆస్ట్రేలియా నుంచి నిత్యం ప్రగతితో వీడియో కాల్స్, వాట్సాప్‌ ద్వారా మాట్లాడేవాడు. ఈ సందర్భంగా ఫోన్‌లో ప్రగతి నగ్న వీడియోలు, ఫొటోలను రికార్డు చేశాడు.

ఆరు నెలల కిందట కార్తీక్‌ స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక కూడా ప్రగతితో చనువుగా తిరిగాడు. కొంతకాలం తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టిన కార్తీక్‌.. పెళ్లికి బంగారం, నగదుతో పాటు ప్లాట్, భూమి ఇవ్వాలని ప్రగతి, ఆమె తల్లిపై పలుమార్లు ఒత్తిడి తెచ్చాడు. తాను ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నానని.. వేరే సంబంధమైతే ఇంతకన్నా అధిక కట్నం ఇచ్చేవారని, తాను అడిగినన్ని కట్నకానుకలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని లేకపోతే ప్రగతి అశ్లీల వీడియోలు, ఫొటోలను బయటపెడతానని బ్లాక్‌ మెయిల్‌ చేసేవాడు.

చదవండి: (‘సల్మా! నన్ను క్షమించు.. మీకు ఏమీ చేయలేకపోయా')

ఇదిలా ఉండగా అక్టోబర్‌ 21న నిశ్చితార్థం ఉండగా, 17వ తేదీన పెద్దల మధ్య కట్నకానుల విషయంలో గొడవ జరగడంతో సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కార్తీక్‌ తన ఫొటోలు, వీడియోలు బయటపెడితే జీవితం నాశనం అవుతుందని భావించిన ప్రగతి అక్టోబర్‌ 18న అర్ధరాత్రి ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ప్రగతి, రామ్‌ కార్తీక్‌ల సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించగా ఫొటోలు, వీడియోలు, కార్తీక్‌ బ్లాక్‌మెయిల్‌ విషయం వెలుగు చూసింది. ప్రగతి ఆత్మహత్యకు రామ్‌ బ్లాక్‌ మెయిల్‌ కారణమని నిర్ధారించిన పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు