‘దసరా పండగకి కొత్త దుస్తులు నాన్నా.. ఈ రోజే తెద్దాంలే కన్నా’.. అంతలోనే

27 Sep, 2022 10:58 IST|Sakshi
అక్షిత్‌ మృతదేహంతో తండ్రి భిక్షపతి

సాక్షి, రంగారెడ్డి: ‘నాన్నా.. దసరా పండగకి నాకు కొత్త దుస్తులు కావాలి..’ ఇదీ కొడుకు కోరిక. తెద్దాంలే నాన్న.. ఈ రోజే తీసుకుందాం.. ఇదీ చిరునవ్వుతో తండ్రి వాగ్దానం. అంతలోనే విధి వక్రీకరించింది. గంట వ్యవధిలోనే కొడుకును నీటి గుంత పొట్టనపెట్టుకుంది. పండుగ దుస్తు లు కావాలన్న కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఆ తండ్రి రోదనకు అంతే లేకుండా పోయింది. షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని సోలీపూర్‌ శివారులో నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన సంఘటనలో నెలకొన్న విషాదం ఇదీ.

వ్యవసాయ కూలీగా పని చేసే భిక్షపతి కుమారుడు అక్షిత్‌ సోమవారం ఉదయాన్నే పండుగ దుస్తులు అడిగాడు. తీసుకుందాం అనుకున్నంతలోనే ఈ ఘోరం జరిగిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని కన్నీరుమున్నీరయ్యాడు. ముగ్గురు కుమారుల్లో చిన్న వాడైన అక్షిత్‌ను అల్లారుముద్దుగా చూసుకున్నామని.. ఇలా జరుగుతుందనుకోలేదని తల్లిదండ్రులు భిక్షపతి, శివలీల రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.  

ఆ ఇద్దరూ అన్నదమ్ముల కొడుకులు  
మృతి చెందిన మరో ఇద్దరిలో సైఫ్, ఫరీద్‌ అన్నదమ్ముల పిల్లలు. మృతుల తండ్రులు సలీం, నయూం వరుసకు అన్నదమ్ములు. ఎక్కడికి వెళ్లినా సైఫ్, ఫరీద్‌ ఒకరిని విడిచి ఒకరు ఉండే వారు కాదని.. ఒకరంటే మరొకరికి ఎంతో ప్రాణమని కుటంబ సభ్యులు తెలిపారు. బతుకమ్మలు, నవరాత్రులతో సందడిగా ఉన్న గ్రామంలో ముగ్గురి మరణం ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. 

మరిన్ని వార్తలు