మావోయిస్టుల ఏరివేతే లక్ష్యం

20 Oct, 2020 12:42 IST|Sakshi

సాక్షి, ములుగు: మావోయిస్టుల ఏరివేతే ప్రధాన లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పని చేస్తోందని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ సంగ్రాంసింగ్‌ పాటిల్‌ తెలిపారు. జిల్లాలోని మంగపేట మండలంలోని నర్సింహసాగర్‌ సమీపాన ముసలమ్మగుట్టలో ఆదివారం ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం విదితమే. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన ఏఎస్పీలు సాయిచైతన్య, శరత్‌చంద్ర పవార్‌తో కలిసి మాట్లాడారు. మావోయిస్టుల కారణంగా అమాయక గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఏజెన్సీలో జరుగుతున్న పరిమాణాలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోందని, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల పోలీసులు ఉమ్మడిగా సమన్వయంతో పనిచేస్తూ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లోని ఇతర రాష్ట్రాల పోలీసులతో మావోయిస్టుల ఏరివేతపై సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లోన్ని అడవుల్లో పెద్దఎత్తున కూంబింగ్‌ సాగుతోందని, మావోలు ఎలాంటి దుశ్చర్చలకు పాల్పకుండా చూస్తున్నామని ఎస్పీ వివరించారు.

మృతులు వీరే...
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో రవ్వ రామల్‌ అలియాస్‌ సుధీర్‌(30) స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలోని జెల్ల గ్రామం కాగా, ఈయన మణుగూరు ఏరియా సభ్యుడే కాక ఎల్‌ఓఎస్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక మరో మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చెన్నాపూర్‌కి చెందిన లక్మా(26) కాగా, ఆయన ఇదే దళంలో సభ్యుడిగా ఉన్నాడు. రవ్వ రామల్‌పై గతంలో ఆరు కేసులు ఉండగా, ప్రభుత్వం తరపున రూ.4లక్షల రివార్డ్‌ ఉంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఎస్‌ఎల్‌ఆర్, రెండు ఎస్‌బీబీఎల్, విప్లవ సాహిత్యం, కిట్‌ బ్యాగులు, రెండు ఏకే 47 మ్యాగజిన్‌లు 16, 7.62 ఎంఎం రౌండ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం.. 
ముసలమ్మగుట్ట నుంచి మృతదేహాలను ఆదివారం అర్థరాత్రి ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని బీరెల్లి మీదుగా ఏటూరునాగారం సామాజిక అస్పత్రికి ట్రాక్టర్‌పై తరలించారు. అక్కడి నుంచి సోమవారం తెల్లవారుజామున ములు గు ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాలను తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

2007లో మావోయిస్టుల్లోకి వెళ్లిన రామల్‌
వెంకటాపురం(కే): మంగపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముసలమ్మ గుట్ట ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మణుగూరు ఏరియా కమిటీ సభ్యుడు, ఎల్‌ఓఎస్‌ కమాండర్‌ రవ్వ రామల్‌ అలియాస్‌ సుధీర్‌ 2007 నుండి అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకు మా జిల్లా కట్టెకళ్యాణ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి దబ్బా గ్రామానికి చెందిన రామల్‌ వెంకటాపురం(కే) మండలం పాత్రాపురం పంచాయతీ జెల్లా గ్రామంలో నివాసముంటున్నట్లు సమాచారం. మావోయిస్టుల భావజాలం, పాటలకు ఆకర్షితుడైన ఆయన దళంలో చేరాడు. అప్పటి నుంచి వివిధ కేడర్లలో పనిచేశారు. ప్రధాన నిందితుడిగా వివిధ పోలీస్‌స్టేషన్లలో ఆరు కేసులు నమోదు కాగా, ప్రభుత్వం రూ.4లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

2015లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కోడిజుట్టు గుట్ట వద్ద కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులపై ఎదురు కాల్పులు జరిపిన కేసులో ప్రధాన నిందితుడిగా వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైంది. 2015లో వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారి పనుల్లో ఉన్న వాహనాలు తగలబెట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా పేరూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉంది. ఇక 2017లో వెంకటాపురం మండలం రాచపల్లి సమీప పాలెం వాగు ప్రాజెక్టు వెళ్లే రహదారిలోని కొప్పగుట్ట వద్ద రోడ్డుపై మందుపాతర అమర్చిన కేసు, 2018 ఎదిరలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ పేల్చిన కేసుల్లో ప్రధాన నిందితుడిగా వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అలాగే, ఏటూరునాగారం సర్కిల్‌ పరిధిలో ఆయనపై మరో రెండు కేసులు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు