Karnataka: అర్ధరాత్రి.. అడవిలో రేవ్‌ పార్టీలు

20 Sep, 2021 09:01 IST|Sakshi
రేవ్‌పార్టీలో యువతీ యువకులే అధికం

సాక్షి,బనశంకరి(కర్ణాటక): నగర శివారులోని బన్నేరుఘట్ట అటవీప్రాంతంలో గుట్టుగా నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీపై శనివారం అర్ధరాత్రి బెంగళూరు రూరల్‌ పోలీసులు దాడిచేసి ఇద్దరిని అరెస్ట్‌ చేసి, 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. బన్నేరుఘట్ట, తమిళనాడు సరిహద్దు గల తమ్మనాయకనహళ్లి అటవీప్రాంతం సమీపంలో గల ముత్యాలమడుగు కాలువ వద్దనున్న రిసార్టు ఆధ్వర్యంలో రేవ్‌ పార్టీ జరిపారు. పెద్దసంఖ్యలో యువతీ యువకులు మత్తు పదార్థాలను సేవించి అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో పోలీసులు దాడి చేసి పార్టీని నిలిపేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో చాలామంది కేరళకు చెందినవారు. వారిలో విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పార్టీలో 60 మందికి పైగా పాల్గొనగా పోలీసులను చూడగానే కొందరు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న 30 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, డ్రగ్స్‌ వాడారా లేదా అనేది నిర్ధారణకు రక్త నమూనా, వెంట్రుకల పరీక్షలు చేస్తున్నారు.  

మోడల్స్, డీజే హంగామా 
నగరానికి చెందిన అభిలాష్‌ అనే వ్యక్తి రేవ్‌పార్టీ నిర్వాహకుడు. ఒక యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్నారు. మోడల్స్‌ను, డీజేలను పిలిపించారు. శనివారం రాత్రి 8 గంటలకు పార్టీ ప్రారంభం కాగా నిర్వాహకులు అర్ధరాత్రి డీజేతో హోరు పెంచారు. చుట్టూ అడవి ఉండడంతో పార్టీ సంగతి ఎవరికీ తెలియదు. ఘటనాస్థలంలో మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి రిసార్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. యువతీ యువకుల వాహనాల్ని, డీజే సామగ్రిని సీజ్‌ చేశారు. అడవిలో 30 మందికి పైగా ఉడాయించగా ఆనేకల్‌ పోలీసులు ఆదివారం గాలింపు చేపట్టారు.   

చదవండి:  అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
  

మరిన్ని వార్తలు