మద్యం మత్తులో రియల్‌ ఎస్టేట్‌ ఉద్యోగి దారుణ హత్య

6 Jul, 2021 08:34 IST|Sakshi

సాక్షి,అల్లిపురం (విశాఖ దక్షిణ): రియల్‌ ఎస్టేట్‌ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. స్నేహితుల మధ్య స్వల్వ వాగ్వాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ జి.సోమశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రెడ్డి గోపాలకృష్ణ (26) తిరుమల రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో సైట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బీచ్‌రోడ్డులో గోకుల్‌పార్కు ఎదురుగా గల ప్రతిమ ప్యారడైజ్‌ అపార్టుమెంట్‌లో మరో ఇంజినీర్‌తో కలిసి ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం భవాని హోటల్‌ యజమాని బ్రహ్మయ్య చౌదరి, మరో ఇద్దరితో కలిసి అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు.

ఐదుగురు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో తన ప్లాట్‌కు మద్యం తాగి రావొద్దని గతంలో బ్రహ్మయ్య చౌదరితో గోపాలకృష్ణ అన్న మాటలు ప్రస్తావనకు వచ్చి వాగ్వాదం చోటుచేసుకుంది. స్నేహితులు వారించే ప్రయత్నం చేసినా వారు వినుకోలేదు. మద్యం మత్తులో ఉన్న బ్రహ్మయ్య చౌదరి వంటగదిలో ఉన్న చాకు తీసుకువచ్చి గోపాలకృష్ణ కడుపు భాగంలో పొడిచేశాడు. దీంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

బ్రహ్మయ్యచౌదరి అక్కడ నుంచి పరారయ్యాడు. అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రాత్రి 7.30 గంటలకు మహారాణిపేట సీఐ జి.సోమశేఖర్, ఎస్‌ఐ కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని కేజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకుని పశ్చిమగోదావరి జిల్లాలో ఉంటున్న అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. బ్రహ్మయ్యచౌదరితో వచ్చిన ఇద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.   

మరిన్ని వార్తలు