రియల్టర్ల జంట హత్య: ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు 

17 Mar, 2022 12:00 IST|Sakshi
ఏసీపీ కె.బాలకృష్ణారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అనుకున్నట్టుగానే ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.బాలకృష్ణారెడ్డిపై వేటు పడింది. సంచలనం రేపిన ఇబ్రహీంపట్నం కర్ణంగూడ రియల్టర్ల జంట హత్యల కేసులో విధుల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణ నేపథ్యంలో బాలకృష్ణారెడ్డిని అంబర్‌పేట సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో భువనగిరి ట్రాఫిక్‌ ఏసీపీ ఎం.శంకరయ్యను నియమించారు.

ఇదే వ్యవహారంలో ఇబ్రహీంపట్నం పీఎస్‌లో దీర్ఘకాలంగా విధుల్లో ఉన్న మరో పోలీసు అధికారిపై కూడా త్వరలోనే వేటు పడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలోఇబ్రహీంపట్నం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రైటర్‌గా పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ బాలకృష్ణను అంబర్‌పేట హెడ్‌ క్వార్టర్స్‌కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.  

ప్రభుత్వం సీరియస్‌.. 
కర్ణంగూడలోని లేక్‌విల్లా ఆర్చిడ్స్‌లో నెలకొన్న భూ వివాదాలపై అసోసియేషన్‌ ప్రతినిధులతో పాటు శ్రీనివాస్‌ రెడ్డి, రాఘవేందర్‌ రెడ్డిల హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్డి మట్టారెడ్డి గతంలో ఇబ్రహీంపట్నం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కానీ, పోలీసులు శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌ రెడ్డిలకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పోలీసులకు భారీ స్థాయిలోనే ముడుపులు ముట్టాయని ఆరోపణలు వినిపించాయి. ఏం చేయలేని స్థితిలో మట్టారెడ్డి హత్యకు పథకం రచించినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. పోలీసుల వ్యవహారంపై సీరియస్‌ అయిన సర్కారు.. శాఖాపరమైన విచారణకు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది.  

ఇక్కడ పరారీ..అక్కడ జైలులో.. 
హత్య జరిగిన 48 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు ప్రధాన నిందితుడు మట్టారెడ్డితో సహా ఖాజా మోహియుద్దిన్, బుర్రి భిక్షపతి, సయ్యద్‌ రహీమ్, సమీర్‌ అలీ, రాజు ఖాన్‌లను అరెస్ట్‌ చేయగా.. హత్యలో వినియోగించిన రెండు తుపాకులను తయారు చేసిన చందన్‌ సిబాన్, సోనులు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు నిందితుల కోసం బీహార్‌కు వెళ్లిన ప్రత్యేక బృందాలకు షాకింగ్‌ న్యూస్‌ తెలిసిందే.

అప్పటికే నిందితులు ఇద్దరిపై బీహార్‌లో పలు కేసులు ఉండటంతో వారిద్దరు స్థానిక జైలులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఉత్తి చేతులతో తిరుగు ప్రయాణమైన రాచకొండ పోలీసులు.. పిటీ వారెంట్‌ను సమర్పించి నిందితులు ఇద్దరిని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.∙

మరిన్ని వార్తలు