విదేశీ హ్యాకర్ల నుంచి డబ్బు రికవరీ

28 Aug, 2020 08:25 IST|Sakshi

మెయిల్‌ హ్యాకింగ్‌ ద్వారా మోసపోయిన సంస్థ 

రూ. 1.14 కోట్లను హ్యాకర్ల అకౌంట్‌కు జమ 

మోసపోయిన విషయం ఆలస్యంగా గుర్తింపు

భీమవరం టూ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు  

సాక్షి, అమరావతి బ్యూరో: ఓ విదేశీ కంపెనీ వ్యాపార లావాదేవీలకు వినియోగించే మెయిల్‌ను హ్యాకింగ్‌ చేసిన హ్యాకర్లు కొందరు ఆ కంపెనీ మెయిల్‌ ఐడీని పోలిన మరొక నకిలీ మెయిల్‌ రూపొందించి తద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీని బురిడీ కొట్టించి రూ.1.14 కోట్లు కొల్లగొట్టారు. మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు విజయవాడ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులును కలిసి సహాయం చేయాలని కోరగా.. పశ్చిమగోదావరి ఎస్పీతో మాట్లాడిన పోలీసు కమిషనర్‌ భీమవరం టూ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేయించి.. బెజవాడ సైబర్‌ క్రైం పోలీసులతో కేసు దర్యాప్తు చేయించి హ్యాకర్లు కొల్లగొట్టిన సొమ్ము నుంచి కొంత రికవరీ చేయించడం విశేషం. వివరాల్లోకి వెళితే..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన భీమవరం కమ్యూనిటీ నెట్‌వర్క్‌ సెంటర్‌కు అమెరికాలోని హార్మోనిక్స్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ తో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఆ కంపెనీతో ఉత్తర ప్రత్యుత్తరాలను మెయిల్‌ ద్వారా జరుపుకునేవారు.  ఇలాంటి మెయిల్స్‌ కోసం ఇంటర్నెట్‌లో సంచరించే హ్యాకర్లు భీమవరం కమ్యూనిటీ నెట్‌వర్క్‌ సెంటర్‌ మెయిల్‌ను హ్యాక్‌ చేసి వారి వ్యాపార లావాదేవీలపై అవగాహనకు వచ్చారు. అనంతరం హార్మోనిక్స్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ మెయిల్‌ ఐడీని పోలిన నకిలీ మెయిల్‌ను సృష్టించారు. దాని ద్వారా భీమవరం కమ్యూనిటీ నెట్‌వర్క్‌ కంపెనీకి మెయిల్స్‌ పంపి, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బును హార్మోనిక్స్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ అకౌంట్‌లో కాకుండా.. తాము సూచించిన అకౌంట్‌ నందు జమ చేసే విధంగా హ్యాకర్లు ఏర్పాట్లు చేసుకున్నారు.

సదరు మెయిల్స్‌ నిజమైనవిగా భావించిన భీమవరం కమ్యూనిటీ సెంటర్‌ నిర్వాహకులు రూ. 1.14 కోట్ల (1,50,913 యూఎస్‌ డాలర్లు)ను రెండు దఫాలుగా హ్యాకర్లు సూచించిన అకౌంట్‌లో జూన్‌ నెలలో జమ చేశారు. ఆ తరువాత తాము మోసపోయామని గుర్తించిన నిర్వాహకులు విజయవాడ పోలీసు కమిషనర్‌ను కలిసి సహాయం చేయమని విజ్ఞప్తి చేశారు. దాంతో కమిషనర్‌ స్పందించి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడి.. భీమవరం టూ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో బాధితుడి ద్వారా ఫిర్యాదు చేయించారు. దర్యాప్తునకు బెజవాడ సైబర్‌క్రైం పోలీసులు సహకారం అందించాలని ఆదేశించారు.  

రూ. 33.08 లక్షల రికవరీ..  
నగర కమిషనర్‌ ఆదేశాలతో దర్యాప్తును కొనసాగించిన సైబర్‌క్రైం పోలీసులు బాధితులు పోగొట్టుకున్న నగదు యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌లో జమ అయినట్లు గుర్తించారు. తరువాత బాధితుడి అకౌంట్‌ ఉన్న ఎస్‌బీఐ ఫోరెక్స్‌ బ్రాంచ్‌ ద్వారా చెన్నై హెచ్‌ఎస్‌బీసీ బ్రాంచ్‌కు వివరాలు తెలిపారు. చెన్నై బ్రాంచ్‌ ద్వారా యూకే హెచ్‌ఎస్‌బీసీ బ్రాంచ్‌ను సంప్రదించిన సైబర్‌ పోలీసులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి బాధితుడు పోగొ ట్టుకున్న సొమ్ములో రూ.33,08,068 లక్షల నగదు (44, 551.11 యూఎస్‌ డాలర్లు)ను భీమవరం కమ్యూనిటీ నెట్‌వర్క్‌ కంపెనీ అకౌంట్‌లో జమ చేయించారు. ఈ కేసు కౌంటర్‌ పార్ట్‌ అయిన హార్మోనిక్స్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ యాజమాన్యాన్ని విజయవాడ సైబర్‌క్రైం పోలీసులు సంప్రదించి వారి ద్వారా యూకేలోని వెస్ట్‌ యార్క్‌షైర్‌ పోలీసుస్టేషన్‌లో కూడా కేసు నమోదు చేయించారు. 

మరిన్ని వార్తలు