ఎవరీ బాషా భాయ్‌..?

5 Nov, 2020 11:56 IST|Sakshi

అంతర్జాతీయ హద్దులు దాటుతున్న ఎర్రబంగారం

కొందరు పోలీసు, అటవీశాఖ సిబ్బంది ప్రమేయం

అడవుల్లోకి చొరబడుతున్న స్మగ్లర్లకు గ్రీన్‌సిగ్నల్‌

కడప అర్బన్‌: కొందరు పోలీసు, అటవీ అధికారుల వైఫల్యం..లాలూచీ.. వెరసి జిల్లాలో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ జోరుగా సాగుతూనే ఉంది. తరచూ పోలీసు, అటవీ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్‌ నిర్వహిస్తున్నామని.. కొందరు కూలీలను, స్మగ్లర్లను అరెస్టు చేశామని దుంగలు, దొంగలతో ఫొటోలకు ఫోజులివ్వడం రివాజుగా మారింది. ఎర్రచందనం తరలిస్తూ పోలీసులకు లేదా అటవీ అధికారులకు దొరికిన వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారా.. లేక ఆ దిశగా దర్యాప్తు చేసేందుకు వేరే కారణాలేమైనా అడ్డుగా ఉన్నాయా అనేది అర్థం కావడం లేదు.

సాధారణంగా ఒక కేసులో నిందితుడిని అరెస్టు చేసినప్పుడు అతన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చింది ఎవరు.. అతనితో వీరికి పరిచయం ఎలా కలిగింది.. ఇక్కడి అడవుల్లో మకాం వేసిన తర్వాత వారికి అవసరమైన నిత్యావసరాలను సరఫరా చేస్తున్నది ఎవరు.. స్థానికంగా వారికి సహకరిస్తున్నది ఎవరు.. ఇక్కడి సంపదను ఎక్కడికి తరలిస్తారు.. వారి డంప్‌ ఎక్కడ ఉంది.. స్మగ్లింగ్‌లో భాగస్వాములైన కీలక వ్యక్తులు ఎవరు.. ఇలాంటి పలు అంశాల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపడితే ఎర్రచందనం స్మగ్లర్ల మూలాలను తెలుసుకునేందుకు వీలుంటుంది. కానీ నిత్యం ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశామని ప్రకటించడం తప్ప వారి వెనుక ఉన్న బడా వ్యక్తుల గుట్టు రట్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం రాయలసీమ వ్యాప్తంగా దాదాపు 5లక్షల హెక్టార్లలో ఉండగా కేవలం జిల్లాలోని అటవీప్రాంతంలోనే 3.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట అటవీ డివిజన్‌ల పరిధిల్లో అన్నిచోట్ల 13 అటవీశాఖ చెక్‌పోస్ట్‌లు ఉన్నప్పటికీ, ఆయా ప్రాంతాల్లో పోలీసుల సమన్వయంతో విధులను నిర్వహించాల్సిన సిబ్బంది స్మగ్లర్లు ఇచ్చే డబ్బులకు ఆశపడి, వారి మార్గాన్ని సులువు చేస్తున్నారు జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, బద్వేల్, సిద్దవటం, అట్లూరు, మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు, వనిపెంట, గువ్వలచెరువు, రామాపురం, పెండ్లిమర్రి, కడప నగర శివార్లలోని పాలకొండలు, మామిళ్లపల్లె ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లోకి చొరబడుతున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడు ప్రాంతం నుంచి కూలీలను చెన్నైలోని కోయంబేడు బస్టాండ్‌ నుంచి గతంలో జిల్లాకు యథేచ్ఛగా ఆర్టీసి బస్సుల్లోనే తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు రూటు మార్చి చైన్నె నుంచి వాహనాల్లోనే జిల్లాలో తమకు అనుకూలంగా ఉన్న అటవీప్రాంతంలోకి చొరబడుతున్నారు. రైల్వేకోడూరు, రాయచోటి, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, పెండ్లిమర్రి ప్రాంతాలకు చెందిన వ్యక్తులే ఎర్రచందనం స్మగ్లర్లుగా పేరొందుతున్నారు. స్థానికంగా ఉన్న స్మగ్లర్ల సహకారంతో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి స్మగ్లర్లు దశలవారీగా కొందరు పోలీసు, అటవీ అధికారులకు, సిబ్బందికి లక్షల్లో ముడుపులు ఇవ్వడంతోనే వారిని చెక్‌పోస్టులను సైతం సులభంగా దాటించేస్తున్నారు. ఒకచోట అటవీప్రాంతంలోకి ప్రవేశించి, ఎర్రచందనం చెట్లను నరికేసి, మరో మార్గంలో రోడ్లపైకి తీసుకుని వచ్చేస్తూ, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.

అక్రమరవాణా చేసుకుని తీసుకుని వచ్చిన ఎర్రచందనం దుంగలను కడప–రాయచోటి మీదుగా చిన్నమండెం బెంగళూరులోని కటిగెనహళ్లికి, రైల్వేకోడూరు వైపుగా తిరుపతి మీదుగా చైన్నెకి తీసుకుని వెళుతున్నారు. స్మగ్లర్లు  బరితెగించి పోతుండగా మధ్యలో వారి మాటలు నమ్మి వచ్చిన కూలీలు పలు సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయారు. అయినా తమిళనాడు ప్రాంతం నుంచి కూలీలు ఎర్రచందనం దుంగలు నరికి తరలించేందుకు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. స్మగ్లర్లకు సహకరించారనే కారణంగా గతంలో పలువురు అధికారులపై వేటు పడింది. కానీ మిగిలిన వారి వైఖరిలో మార్పు రాకపోవడం విచారకరం. ఇప్పటికైనా పోలీసు, అటవీ అధికారులు నిజాయితీగా వ్యవహరించి స్మగ్లర్ల ఆటకట్టించాల్సిన అవసరం ఉంది.

సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం– ఎస్పీ
వల్లూరు మండలం గోటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనం, మరొకరు ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. మరో రెండు రోజుల్లో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాన సూత్రధారి, పాత్రధారి బాషాభాయ్‌..
గోటూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళ కూలీలు మృతి చెందిన సంఘటనకు సంబంధించి ప్రధాన సూత్రధారి, పాత్రధారి బాషాభాయ్‌గా పోలీసులు గుర్తించారు. జిల్లాకు చెందిన బాషాభాయ్‌ గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి చెన్నైకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. ఇతనిపై జిల్లాలో మూడు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు సమాచారం. ఇతన్ని పట్టుకునేందుకు ఎర్రచందనం టాస్‌్కఫోర్స్‌ ప్రత్యేక బృందం చెన్నై  వెళ్లినట్లు తెలిసింది. కాగా, ఇతను కారులో ప్రయాణిస్తున్న లోకల్‌ గ్యాంగ్‌కు రూ.10 లక్షలు ఎర చూపి తమిళ కూలీల స్కార్పియోను అటకాయించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇటియోస్‌ కారులోని ముగ్గురు నిందితులు స్కారి్పయోను వెంబడించి ప్రమాదానికి కారణమయ్యారు. కారులోని ముగ్గురు నిందితులలో పెండ్లిమర్రి మండలానికి చెందిన విశ్వనాథరెడ్డి, రాయచోటికి చెందిన జయరాం నాయక్, కడపకు చెందిన మహేష్‌లు ఉన్నారు. వీరిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. వీరిలో విశ్వనాథరెడ్డిపై ఎనిమిది కేసులు, మహేష్‌పై 14 కేసులు, జయరాం నాయక్‌పై 6 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా