రూ.80 లక్షల విలువైన ఫోన్లు చోరీ 

17 Sep, 2020 05:15 IST|Sakshi
కంటైనర్‌లోని సెల్‌ఫోన్‌ బాక్స్‌లు

కంటైనర్‌లోకి చొరబడి దొంగతనం 

మంగళగిరి/గుంటూరు రూరల్‌ (ప్రత్తిపాడు)/వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): లక్షా రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.80 లక్షల విలువైన సెల్‌ఫోన్‌లను దొంగిలించిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా వద్ద వెలుగుచూసింది. సినీ ఫక్కీలో కంటైనర్‌లోకి చొరబడిన ఆగంతకులు.. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమలో తయారైన 980 రెడ్‌మి ఫోన్లను గోతాల్లో నింపుకుని పారిపోయారు.  

చోరీ ఎలా జరిగిందంటే.. 
శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు సెల్‌ఫోన్ల లోడుతో బయలుదేరిన కంటైనర్‌ వెనుక తాళాలను కత్తిరించిన దుండగులు.. లోపలకి చొరబడి కొన్ని మొబైల్స్‌ను దొంగిలించి, వాహనం ఆగిన సమయంలో దిగి పారిపోయారు. వెనుకగా వస్తున్న వాహనదారులు కాజ టోల్‌ ప్లాజా వద్ద కంటైనర్‌ డ్రైవర్‌కు ఆగంతకులు చొరబడిన విషయాన్ని చెప్పారు. దీంతో డ్రైవర్, సిబ్బంది బుధవారం ఉదయం మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు కంటైనర్‌తో సహా చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, నార్త్‌జోన్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ మంగళగిరి చేరుకుని వివరాలు సేకరించారు. కంటైనర్‌లో మొత్తం రూ.9 కోట్లు విలువైన సెల్‌ఫోన్‌లు ఉన్నట్లు వెల్లడించారు.  

3 ఏళ్ల కిందట కూడా ఇదే తరహాలో.. 
సరిగ్గా మూడేళ్ల కిందట కూడా ఇదే పరిశ్రమలో తయారైన మొబైల్‌ ఫోన్లు తరలిస్తున్న కంటైనర్‌ లారీ నెల్లూరుకు సమీపంలో చోరీకి గురైంది. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు చోరీకి పాల్పడిన ముఠాను గుర్తించి కొంతమేరకు రికవరీ చేశారు. అదే ముఠా చోరీకి పాల్పడిందా? లేదా? మరో ముఠా అలాంటి పన్నాగం పన్నిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా