ఆస్తి కాజేసిండు.. వెళ్లిపొమ్మంటుండు

8 Jun, 2021 08:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కోనరావుపేట(రాజన్న సిరిసిల్ల): దగ్గరి బంధువని చేరదీస్తే ఉన్న ఆస్తి రాయించుకున్నాడు. ఇప్పుడు ఆ వృద్ధురాలినే ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటున్నాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని నిమ్మపల్లికి చెందిన మానుక రాజయ్య–నర్సవ్వ దంపతులకు పిల్లలు లేరు. కొన్నేళ్ల క్రితం నుంచి దగ్గరి బంధువు మానుక శంకర్‌ వారింట్లోనే ఉంటున్నాడు. రాజయ్యకు ఫించన్‌ ఇప్పిస్తానని చెప్పి ఆస్తి కాగితాలపై సంతకాలు చేయించుకుని ఇల్లు, 30 గుంటల భూమిని తనపేరిట చేయించుకున్నాడు. రాజయ్య నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు.

ఈక్రమంలో ఒంటరి అయిన నర్సవ్వకు తిండి పెట్టకపోవడంతో శంకర్‌ను నిలదీయగా ఇది తనదని, వెళ్లిపొమ్మంటూ కొడుతున్నాడని బాధితురాలు రోదిస్తూ చెప్పింది. శంకర్‌ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకుంది. గ్రామానికి వచ్చి విచారణ జరిపి న్యాయం చేస్తానని వృద్ధురాలికి ఎస్సై రాజశేఖర్‌ హామీ ఇచ్చారు. 

కన్న కొడుకులు కూడు పెడ్తలేరు
వేములవాడ: కనీ పెంచి పెద్దచేసిన కొడుకులు మలిసంధ్యలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండలంలోని నిజామాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమ బాధను చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన శ్రీరాముల రామయ్య–సత్తవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు దేవయ్య, లచ్చయ్య, చంద్రయ్య. వృద్ధులు కావడంతో ఒక్కో కొడుకు దగ్గర 3 నెలలు ఉండాలని నిర్ణయించారు.

కానీ గత కొన్ని నెలలుగా దేవయ్య, లచ్చయ్య తల్లిదండ్రులను పోషించడంలేదు. ఇంట్లోకి రానివ్వకపోవడంతో చిన్న కుమారుడు చంద్రయ్య వద్దే ఆరునెలల నుంచి ఉంటున్నారు. సోమవారం ఎస్సై రాజశేఖర్‌ను కలిసి తన ఇద్దరు కుమారులు పోషించడంలేదని ఫిర్యాదు చేశారు. కుమారులను పిలిపించి మాట్లాడుతానని బాధితులకు ఎస్సై హామీ ఇచ్చారు.  

చదవండి: భార్యను తిట్టాడని ఆవేశంతో.. కన్న తండ్రినే

మరిన్ని వార్తలు