రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య 

25 Jul, 2021 07:07 IST|Sakshi
షేక్‌ ఖాజామియా (ఫైల్‌)

చర్లపల్లి జైలులో వారం రోజుల్లో ఇద్దరు ఖైదీల బలవన్మరణం 

భద్రతా లోపాలవల్లే అని విమర్శలు 

బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న జైళ్ల శాఖ డీఐజీ 

కుషాయిగూడ: ఖైదీల వరుస ఆత్మహత్యలు చర్లపల్లి జైలులో భద్రతా లోపాలను ఎత్తిచూపుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఆదివారం సిద్దిపేట జిల్లా తూర్పుతండాకు చెందిన బానోతు శ్రీను నాయక్‌ బెడ్‌ షీట్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిమాండ్‌ ఖైదీ షేక్‌ ఖాజామియా టవల్‌తో కిటికీకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆలస్యంగా తేరుకున్న జైలు సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఓ దొంగతనం కేసులో పట్టుబడ్డ ఖాజామియాను మల్కాజిగిరి కోర్టు తీర్పు మేరకు కుషాయిగూడ పోలీసులు ఈ నెల 7న చర్లపల్లి జైలులో రిమాండ్‌ చేశారు. అనారోగ్యమా..మానసిక స్థితో తెలియదు కాని అతడు జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జైల్‌ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ తెలిపారు. 

వారం రోజుల్లో ఇద్దరు ఖైదీలు.. 
శ్రీను నాయక్‌ ఆత్మహత్య మరువక ముందే మరో ఖైదీ ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలులో ఖైదీలు ఆత్మహత్యలకు ఎలా పాల్పడుతున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం, జైలు అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై జైళ్లశాఖ డీఐజీ ఎన్‌. మురళీబాబును వివరణ కోరగా జైదీల మానసిక స్థితి బాగోలేకనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రతి బ్లాక్‌ వద్ద  పటిష్ట భద్రత ఉంటుందన్నారు. వార్డర్, హెడ్‌వార్డర్, చీఫ్‌ హెడ్‌ వార్డర్‌తో పాటుగా వారిని పర్యవేక్షించేందుకు డిప్యూటీ జైలర్లు ఉంటారని తెలిపారు. వారంలో ఇద్దరు ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు