-

కరోనా డాక్టర్ల కాసుల దందా.. బ్లాక్‌ మార్కెట్‌లో రెమిడెసివర్‌

7 May, 2021 08:38 IST|Sakshi

బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్న రెమిడెసివిర్‌ 

 నగరంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు 

 నిత్యం పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టని వైనం 

 దాడులు పెంచుతామనంటున్న పోలీసులు   

కోవిడ్‌ చికిత్స పొందుతున్న వారికి అందజేసే రెమిడెసివిర్‌  ఇంజెక్షన్లను విక్రయిస్తూ  నగరంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం పలువురు పోలీసులకు చిక్కారు. రెమిడెసివిర్‌ను బ్లాక్‌లో విక్రయిస్తే చర్యలు తప్పవంటూ నిత్యం పోలీసులు హెచ్చరిస్తున్నా దందా ఆగడం లేదు. ఏకంగా డాక్టర్లు, ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది, మెడికల్‌ షాపుల యజమానులు సైతం వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తూ పట్టుబడుతున్నారు. పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తున్నారు.  

మల్లాపూర్‌:  రెమిడెసివిర్‌ డోసులను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిని గురువారం మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేసి నాచారం పోలీసులకు అప్పగించారు. నాచారం సీఐ కిరణ్‌కుమార్‌ వివరాల ప్రకారం.. బోడుప్పల్‌ పీర్జాదిగూడకు చెందిన కె.వినీత్‌(26) మెడికల్‌ సప్లయిర్‌. రెమిడెసివిర్‌ డోసులను రూ.27 వేలకు విక్రయిస్తూ పట్టుబడ్డారు. వినీత్‌ వద్ద నుంచి 5 రెమిడెసివిర్‌ డోసులు, 2 సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

నాచారం స్నేహపురి కాలనీలో.. 

కొండాపూర్‌కు చెందిన బల్‌వీర్, గిరీష్‌ స్నేహితులు. డబ్బు సంపాదించాలనే ఆశతో రెమిడెసివిర్‌ 6 డోసులను కొనుగోలు చేసి రూ.30 వేలకు నాచారంలో విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎంబీబీఎస్‌ డాక్టర్‌ గిరీష్‌ దగ్గర ఉన్న రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు, మొబైల్‌ ఫోన్, కారును స్వాదీనం చేసుకున్నారు. బల్‌వీర్‌ పరారీలో ఉన్నాడని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

కేపీహెచ్‌బీ కాలనీలో.. 

కేపీహెచ్‌బీకాలనీ: రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను వేర్వేరు ప్రాంతాల్లో బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ కాలనీ ఈడబ్ల్యూఎస్‌ క్వార్టర్స్‌లో ఉండే జి.వి.సాగర్‌ శ్రీరాం బీమా కంపెనీలో పనిచేస్తుంటాడు. రెమెడెసివిర్‌ ఇంజక్షన్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు అతడి ఇంటిపై దాడి చేశారు. అతడి వద్ద ఉన్న 20 ఎంఎల్‌ రెమెడెసివిర్‌ ఇంజక్షన్‌తో పాటు బైక్, మొబైల్‌ ఫోన్‌ను స్వాదీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు.  

మరో ఘటనలో.. 

నిజాంపేట కేటీఆర్‌ కాలనీ రుక్మిణీ రెసిడెన్సిలో నివాసముండే ఒంగోలు సుబ్బారావు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్‌–1లో రెమెడెసివిర్‌ ఇంజక్షన్‌ను అధిక ధరకు విక్రయిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రెమిడెసివిర్‌ ను స్వాదీనం చేసుకున్నారు.  

మెడికల్‌షాపు యజమాని..

అబిడ్స్‌: రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను బాక్ల్‌లో విక్రయిస్తున్న మెడికల్‌షాపు యజమానిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుడిమల్కాపూర్‌లోని ధరణి మెడికల్‌ షాపు యజమాని నిఖిల్‌ అగర్వాల్‌ మరో ఇద్దరితో కలిసి ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో టాస్‌్కఫోర్స్‌ పోలీ సులు మెడికల్‌షాపుపై దాడిచేసి నిఖిల్‌ అగర్వాల్, మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద ఐదు ఇంజక్షన్లను స్వా«దీనం చేసుకున్నారు. ఒక్కో ఇంజక్షన్లను రూ.30 వేలకు బ్లాక్‌లో విక్రయిస్తున్న నిఖిల్‌ అగర్వాల్‌పై కేసు నమోదు చేసి టప్పాచబుత్ర పోలీసులకు అప్పగించారు. కేసును టప్పాచబుత్ర ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. 

కాప్రా లైఫ్‌లైన్‌ ఆస్పత్రి వద్ద.. 

కుషాయిగూడ: కూకట్‌పల్లికి చెందిన కె.సత్యనారాయణ శర్మ, కె.సుజన్‌కిషన్‌ కొన్ని రోజులుగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను బ్లాక్‌లో రూ.35 వేలకు విక్రయిస్తున్నారు. మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు కాప్రా లైఫ్‌లైన్‌ ఆస్పత్రి వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. 6 ఇంజక్షన్లు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కుషాయిగూడ పోలీసులకు అప్పగించినట్లు ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు.   
 

మరిన్ని వార్తలు