సరస్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు

4 Jan, 2023 01:28 IST|Sakshi
రాజేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు  చేస్తున్న బాసర ఆలయ సిబ్బంది 

బాసరలో ప్రజలు, అర్చకుల నిరసనలు.. యువకుడిపై కేసు నమోదు

బాసర (ముథోల్‌): బాసరలోని జ్ఞాన సరస్వతీదేవిపై భారతీయ నాస్తిక సంఘం రాష్ట్ర శాఖకు చెందిన రేంజర్ల రాజేశ్‌ అనే గాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మంగళవారం బాసరవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. స్థానిక రైల్వేస్టేషన్‌ చౌరస్తాలో బైఠాయించి రాజేశ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

అమ్మవారిని వ్యంగ్య పదాలతో దూషించిన రాజేశ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బాసర ఆలయ అర్చకులు, సిబ్బంది, ఆలయ తాత్కాలిక లేబర్‌ సొసైటీ సిబ్బంది సైతం అమ్మవారి ఆలయ ప్రధాన గోపురం ఎదుట ధర్నా చేశారు. గ్రామస్తులతో కలసి ర్యాలీగా వెళ్లి.. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. రాజేశ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్‌పై ఐపీíసీ 153, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు. కాగా, సరస్వతీదేవిని దూషించిన హిందూ ద్రోహి రేంజర్ల రాజేశ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని వీహెచ్‌పీ రాష్ట్ర శాఖ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేసింది.

నరేశ్‌ను అరెస్ట్‌ చేసిన మహారాష్ట్ర పోలీసులు
కాళేశ్వరం: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే వికారాబాద్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న హనుమకొండ జిల్లాకు చెందిన బైరి నరేశ్‌ను మహారాష్ట్ర పోలీసులు ఇదే తరహా కేసులో అరెస్టు చేశారు. అతన్ని గడ్చిరోలి జిల్లా సిరొంచ కోర్టులో మంగళవారం హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. గతేడాది డిసెంబర్‌ 24, 25 తేదీల్లో సిరొంచలో నిర్వహించిన కార్యక్రమంలో హిందూ దేవతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సిరొంచ, అహేరి తాలూకాల్లో అతనిపై కేసు నమోదైంది.

హిందూ దేవుళ్లను తిడితే వీపులు పగలకొట్టండి 
ఎంపీ సోయం బాపూరావ్‌
బోథ్‌:
హిందూ దేవుళ్లను తిట్టినా.. కించపరిచినా వారి వీపులు పగలకొట్టాలని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావ్‌ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని దేవుల్‌నాయక్‌ తండాలో మంగళవారం నిర్వహించిన జగదాంబదేవి జాతరలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు