అర్నబ్‌ గోస్వామి అరెస్ట్‌

5 Nov, 2020 04:34 IST|Sakshi
పోలీసు వాహనంలో అర్నబ్‌

అరెస్టు వారంటును చించేసిన అర్నబ్‌ భార్య

మహిళా పోలీస్‌పై అర్నబ్‌ చేయి చేసుకున్నారంటూ ఎఫ్‌ఐఆర్‌

ముంబై: రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామిని రాయగఢ్‌ జిల్లా అలీబాగ్‌ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. 2018లో ఇంటీరియర్‌ డిజైనర్‌  అన్వయ్‌ నాయిక్‌ (53) ఆత్మహత్యకు సంబంధించి అర్నబ్‌ను అరెస్టు చేసినట్టు అలీబాగ్‌ పోలీసులు పేర్కొ న్నారు. తననెందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తూ, అరెస్టువారెంటు చూపాలని అర్నబ్‌ వాదించారని పోలీసులు తెలిపారు. అరెస్టు వారంటును చూపించబోగా, అర్నబ్‌ భార్య ఆయా పేపర్లను చించేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత అర్నబ్‌ను అలీబాగ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచారు. గోస్వామిని అలీబాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

వైద్య పరీక్షల అనంతరం మళ్లీ ఆయనను కోర్టులో హాజరుపరచాలని చెబుతూ ఈనెల 18 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. గోస్వామి ని పోలీసులు అరెస్టు చేసే సమయంలో పోలీసులు అర్నబ్‌పై చేయి చేసుకున్నారని, అర్నబ్‌తోపాటు ఆయన న్యాయవాది గౌరవ్‌ పార్కర్‌లు ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసుల బృందంలో ఉన్న మహిళా పోలీసుపై అర్నబ్‌ చేయి చేసుకున్నారన్న అభియోగాలతో ఆయనపై మరో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. మహిళా పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. తన భర్తకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఉంటే నేడు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్‌ నాయక్‌ భార్య అక్షతా పేర్కొన్నారు.

చట్టం ముందు అంతా ఒక్కటే..
చట్టం ముందు ఎవరూ గొప్పవారు కాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు. అన్వయ్‌ కుటుంబీకుల ఫిర్యాదు మేరకే ఈ కేసును తిరిగి విచారణ చేపట్టేందుకు కోర్టులో దరఖాస్తు చేసినట్టు చెప్పారు. అనంతరం కోర్టు అనుమతితోనే ఈ అరెస్టు జరిగిందని చట్టప్రకారం పోలీసులు తమ పని తాము చేస్తున్నారన్నారని అనిల్‌ దేశ్‌ముఖ్‌ స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు