వెంటాడే చిత్రాలు..

11 Nov, 2021 02:24 IST|Sakshi

ఉద్యోగంలో ప్రమోషన్‌ రావడంతో ఫ్రెండ్స్‌కి హోటల్‌లో పార్టీ ఇచ్చాను. అక్కడ, ఫ్రెండ్స్‌తో పాటు నన్ను నేను మరిచిపోయి చేసిన డ్యాన్స్‌ వీడియోను ఎవరో ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్‌ చేశారు. ఇది నన్ను చాలా ఇబ్బందులకు గురిచేసింది. ఆ వీడియోను ఎలా తొలగించాలో అర్థం కావడంలేదు.
– ఓ బాధితురాలు
∙∙
ఐదేళ్ల క్రితం నా మొదటి భర్తతో విడిపోయాను. మూడేళ్ల క్రితం మళ్లీ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మాకు ఏడాదిన్నర పాప కూడా ఉంది. నా మాజీ భర్తతో గతంలో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు కొన్ని అశ్లీల వెబ్‌సైట్‌లలో కనిపించాయి. అవి చూస్తే ఇప్పటి నా భర్తతో ఇప్పుడు విభేదాలు వచ్చేలా ఉన్నాయి. వాటిని నా మాజీ భర్త పోస్ట్‌ చేయలేదని తెలిసింది. వాటిని తొలగించడం ఎలాగో తెలియడం లేదు.
–ఓ బాధితురాలు
∙∙
ఒక రోజు మద్యం తాగి వాహనం నడిపినందుకు ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భానికి సంబంధించి నేనున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. ఆశ్చర్యపోయాను. ఆ ఫొటోను ఎవరో అనుకోకుండా పోస్ట్‌ చేసి ఉంటారు. చాలా చోట్లకు షేర్‌ అయ్యింది కూడా. కానీ, దాని వల్ల నేను తాగుబోతుననే ముద్ర నా చుట్టూ ఉన్నవారిలో పడుతోంది. అది డిలీట్‌ చేయడం ఎలాగో తెలియదు.
– ఓ బాధితుడు

మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మనకు తెలియకుండానే ఆన్‌లైన్‌ వేదికలపై కనిపిస్తే, ప్రస్తుత జీవితంపై అవి ప్రభావం చూపకుండా ఉండవు. ఇలాంటప్పుడు ఆ చిత్రాలను కానీ, వీడియోలు కానీ డిలీట్‌ చేయడం ఎలా?! దీనికి సంబంధించి ఎవరిని సంప్రదించాలి, వీటి కట్టడికి చట్టాలు లేవా? ఇలాంటి సందేహాలు మనందరిలో రావడం సహజం.

యూజర్‌ హక్కులు
ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తొలగించే హక్కు జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌(జిడిపిఆర్‌)లో భాగంగా ఉంది కానీ దానికి ప్రత్యేకించి చట్టాలు అంటూ ఏమీ లేవు. అయితే, రైట్‌ టు కన్ఫర్మ్, రైట్‌ టు యాక్సెస్, రైట్‌ టు కరెక్ట్, రైట్‌ టు పోర్టబులిటీ, రైట్‌ టు ఫర్‌గెట్‌... ఇవన్నీ వ్యక్తిగత డేటాకు సంబంధించి ఒక యూజర్‌కు ఉన్న హక్కులు.

ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో ‘పరువు’ తీయడం అనేది ఒక ఉద్యమంలా తయారయ్యింది. వాటికి ఎన్ని క్లిక్‌లు, ఎన్ని షేర్‌లు, ఎన్ని కామెంట్లు వస్తే అంత బాగా ‘ఖ్యాతి’ వచ్చినట్టుగా, ‘డబ్బు’లు వస్తాయన్నట్టుగా ఆన్‌లైన్‌ వేదికలు తయారయ్యాయి. అవతలి వ్యక్తికి కలిగే బాధ మీద డబ్బు సంపాదించుకోవడం అతి మామూలు విషయంగా మారిపోవడంతో ఇలాంటి ‘వెంటాడే చిత్రాలు’ మన జీవితంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అయోమయ పరిస్థితిని కలిగిస్తున్నాయి.  

మరేం చేయాలి?
డేటా ప్రొటెక్షన్‌లో భాగంగా ‘రైట్‌ టు ఫర్‌గెట్‌’ హక్కు ఉండాలి. వ్యక్తిగత స్వేచ్ఛకు, స్వతంత్రతకు భంగం వాటిల్లకుండా ఉండాలి. అందుకు ప్రపంచవ్యాప్తంగా మేధావి వర్గం కలిసి ఓ నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమయ్యింది ఈ లోపు మనం చేయాల్సినవి...

www.cybercrime.gov in లోనూ, హెల్ప్‌లైన్‌ 155260 కి ఫోన్‌ చేసి.. ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తూ ఫిర్యాదు చేయాలి. ముఖ్యంగా మహిళ తన పరువుకు భంగం కలిగిందని ఫిర్యాదు చేస్తే.. ఆమెకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సంబంధించిన డేటా 24 గంటల్లోపు తొలగించాలనేది చట్టంలో ఉంది. కాబట్టి ఫిర్యాదులో వెనుకంజ వేయకూడదు.

► సైబర్‌క్రైమ్‌ విభాగం సాయం తీసుకోవాలి.

సోషల్‌ మీడియా నిర్వహణ
మనం సృష్టించిన దానికి తగిన ప్రోత్సాహం లభించడానికి, ఇతరులు మన ఆలోచనలను సానుకూలంగా అర్ధం చేసుకోవడానికి సోషల్‌ మీడియా గొప్ప రహదారి. పాత స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి మంచి అవకాశం. దీంతోపాటు మన కుటుంబంలోని వ్యక్తుల అభిరుచుల, ఆలోచనలనూ గమనించవచ్చు. పరస్పర చర్యల ఆధారంగా ఒక వ్యక్తి ప్రవర్తనా అంశాన్ని సోషల్‌ మీడియా పర్యవేక్షిస్తుంది. అలాగే, డాక్యుమెంట్‌ చేయబడుతుంది. అలాగే, తన వ్యాపార ప్రయోజనం కూడా ఉంటుంది. కాబట్టి అత్యుత్సాహం చూపకుండా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆఫ్‌లైన్‌లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటామో.. అదే విధంగా ఆన్‌లైన్‌ వేదికలు, మనం వెలిబుచ్చే అభిప్రాయాలు, పంచుకునే చిత్రాలు.. అన్నింటి పట్లా జాగరూకతతో ఉండాలి.

అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు