ఆర్‌ఎంపీ డాక్టర్‌.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి..

22 Sep, 2021 07:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అతను ఆర్‌ఎంపీ డాక్టర్‌.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడిన అతడికి వైద్యం చేస్తే వచ్చే డబ్బులు సరిపోలేదు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాల బాటపట్టాడు.. రాత్రి వేళల్లో ల్యాప్‌టాప్‌తో బస్సుల్లో ప్రయాణించే వారినే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు. మంగళవారం ఉదయం వనస్థలిపురంలోని పనామా క్రాస్‌రోడ్‌లో ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లతో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని ఎల్బీనగర్‌ సీసీఎస్‌ ఏసీపీ క్రైమ్‌ ఆర్‌.శేఖర్‌రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.5 లక్షల విలువ చేసే 16 ల్యాప్‌టాప్‌లు, 5 సెల్‌ఫోన్లు, 2 పవర్‌ బ్యాంక్, ఒక వాచ్‌ స్వాధీనం చేసుకున్నారు.  

భద్రాచలం పట్టణంలోని జగదీష్‌ కాలనీకి చెందిన గుడికాడి నవీన్‌ కుమార్‌(41) ఖమ్మం జిల్లా పాల్వంచలోని లక్ష్మిదేవునిపల్లిలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా స్థిరపడ్డాడు. లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన ఇతను డబ్బు కోసం చోరీలు చేస్తుంటాడు. రాత్రి సమయాల్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తుంటాడు. ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లతో బస్‌లలో ప్రయాణించడాన్ని గమనిస్తుంటాడు.

వారితో పాటు తోటి ప్రయాణికుడిగా బస్‌ ఎక్కుతాడు. హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాలకు బస్‌ చేరుకుంటుందనగా ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లను లాక్కొని రన్నింగ్‌ బస్‌ నుంచి సెకనులో దిగేసి పారిపోతాడు. లేదంటే దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లోని బ్యాచ్‌లర్స్‌ రూమ్స్‌లలోకి చొరబడి ల్యాప్‌టాప్స్‌ను దొంగిలిస్తుంటాడు. 

చోరీలో భాగంగా గత నెల 8వ తేదీన ఫిర్యాదుదారుడు, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి నర్సరావుపేట నుంచి నిజాంపేట వెళ్లేందుకు హైదరాబాద్‌ బస్‌ ఎక్కారు. వాళ్లు పనిచేసే కంపెనీ ఇచ్చిన హెచ్‌పీ, డెల్‌ ల్యాప్‌టాప్‌లను తీసుకొని బస్‌లో కూర్చున్నారు. వాళ్ల మొబైల్‌ ఫోన్లను కూడా అదే బ్యాగ్‌లో పెట్టేసి పడుకున్నారు. ఇది గమనించిన నిందితుడు నవీన్‌ కుమార్‌ అదే బస్‌లో ఎక్కాడు.

రిజర్వేషన్‌ చేసుకుంటే వివరాలు తెలిసిపోతాయని.. టికెట్‌కు సరిపోయే డబ్బులు చెల్లించి వారి పక్కనే కూర్చున్నాడు. బస్‌ ఆటోనగర్‌కు సమీపిస్తున్న సమయంలో నిందితుడు ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లతో దిగి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసుకునేసరికి ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌లు కనిపించకపోయేసరికి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

► గతంలో నవీన్‌ కుమార్‌ మీద వనస్థలిపురం, ఎల్బీనగర్, మీర్‌పేట, సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్లలో 5 కేసులు నమోదయ్యాయి.   

చదవండి: అటవీ ప్రాంతంలో పేకాట.. 

మరిన్ని వార్తలు