ఐస్‌క్రీం కోసం వెళ్లి, తిరిగి వస్తుంటే..

31 Oct, 2021 11:07 IST|Sakshi

రాయగడ( భువనేశ్వర్‌): జిల్లా కేంద్రంలోని కొరాపుట్‌ మార్గం నువాసాహి రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. మృతుడు ఆర్‌కే నగర్‌ స్వీపర్‌ కాలనీలో నివసిస్తున్న సునీల్‌ సామల్‌ కుమారుడు సుధాంశుగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ ఎస్‌కే సత్పతి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం సుధాంశు ఐస్‌క్రీం కొనుక్కునేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొంది.

దీంతో చిన్నారి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని స్వీపర్‌ కాలనీవాసులు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకొని, ఆందోళన చేపట్టారు.

చదవండి: వంద కోసం అటెండర్‌ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది

మరిన్ని వార్తలు