Nizamabad Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొని.. 

28 Jun, 2022 02:49 IST|Sakshi
ప్రమాదంలో దగ్ధమైన కారు 

కారులో మంటలు చెలరేగి ఇద్దరు యువకుల సజీవ దహనం 

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద ప్రమాదం 

వేల్పూర్‌: నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం పడగల్‌ రెవెన్యూ శివారులో ఆదివారం అర్ధరాత్రి 63వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రోడ్డుపై ఆగిఉన్న లారీని వీరు ప్రయాణిస్తు ఆల్టో కారు ఢీకొట్టడంతో మంటలు అంటుకుని సజీవ దహనం అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. జగితాల్య జిల్లాలోని కోరుట్లకు చెందిన జెబ్జోర సుమంత్‌ (22), మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన మండలోజ్‌ అనిల్‌కుమార్‌ (26) కారులో నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ వైపు వెళ్తుండగా వేల్పూర్‌ క్రాస్‌రోడ్డుకు సమీపంలో ఆగిఉన్న లారీని ఢీకొట్టారు.

దీంతో కారు పల్టీలు కొట్టి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. వెల్లుల్లకు చెందిన నారాయణ, విజయ దంపతుల కుమారుడైన అనిల్‌ బంగారం వ్యాపారం చేస్తుండగా, కోరుట్లకు చెందిన శ్రీనివాస్, రాధిక దంపతుల కుమారుడైన సుమంత్‌ మెట్‌పల్లిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.

సుమంత్, అనిల్‌ సమీప బంధువుల కుటుంబాలకు చెందిన వారే. ప్రమాదానికి కారణమైన లారీలో  పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి వేళ లారీ రోడ్డుపై ఆగిఉన్నట్లు గ్రహించే అవకాశం లేకపోవడంతో యువకుల కారు దానిని ఢీకొంది. ఘటనా స్థలాన్ని ఆర్మూర్‌ రూరల్‌ సీఐ గోవర్ధన్‌రెడ్డి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వేల్పూర్‌ ఎస్సై వినయ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు