ఆర్టీసీ బస్సు–లారీ ఢీ 

1 Jul, 2022 23:32 IST|Sakshi
ప్రమాదస్థలంలో బస్సు, లారీ

ఒకరి మృతి, 15 మందికి గాయాలు

చింతూరు/మోతుగూడెం: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్‌ మృతిచెందగా బస్సు డ్రైవర్, కండక్టర్‌తో సహా 15 మంది గాయపడ్డారు. చింతూరు, మోతుగూడెం రహదారిలోని సుకుమామిడి సమీపంలో మలుపు వద్ద ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సీలేరు నుంచి విజయవాడ వెళ్తుండగా తెలంగాణ నుంచి ఒడిశాకు సిమెంటు లోడుతో వెళుతున్న లారీని ముందు భాగంలో బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన పల్లపు రాజు(26) లారీ క్యాబిన్, స్టీరింగ్‌ నడుమ ఇరుక్కుని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐలు యాదగిరి, సత్తిబాబు తమ సిబ్బందితో కలసి క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ మృతదేహాన్ని శ్రమించి బయటకు తీశారు. 

ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్‌తో పాటు మరో 15 మందికి కూడా గాయాలు కాగా వీరిని చికిత్స నిమిత్తం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వీరిలో 11 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. డ్రైవర్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చింతూరు తరలించిన పోలీసులు ప్రమాదానికి గురైన బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

కాగా బస్సు డ్రైవర్‌ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సంఘటనపై జిల్లా జాయింట్‌ కలెక్టర్, ఐటీడీఏ పీవో సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని  ఏపీవోను ఆదేశించారు.   

మరిన్ని వార్తలు