చిమ్మచీకటి, గాఢ నిద్ర.. ఏం జరిగిందని తెలుసుకునే లోపే..

14 Jun, 2022 10:41 IST|Sakshi

చింతూరు మండలంలో ట్రావెల్‌ బస్సు బోల్తాపడి ఐదుగురు మృతి 

మృతుల్లో ముగ్గురు చిన్నారులు 

డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

చుట్టూ చిమ్మచీకటి.. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద కుదుపు.. హాహాకారాలు.. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే తమ వారి పంచప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఉపాధి కోసం బయలుదేరిన వారి బతుకులు మధ్యలోనే తెల్లారిపోయాయి. సొంత ఊళ్లో పనులు దొరక్క, పస్తులుండలేక పిల్లాపాపలతో వేరే ప్రాంతానికి కూలి కోసం పయనమైన వారిని మృత్యువు కబళించింది.

సాక్షి,చింతూరు(అల్లూరి సీతారామరాజు జిల్లా)/కొరాపుట్‌: చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, బొడ్డుగూడెం నడుమ జాతీయ రహదారి–30పై ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 నుంచి 2 గంటల మధ్యలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడిన ఘటనలో ఒడిశాకు చెందిన ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతిచెందారు. పొట్టకూటి కోసం వెళుతూ తమ బిడ్డలను సొంత ఊరిలో వదిలి వెళ్లలేక తమతో తీసుకెళుతున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో బిడ్డలను కోల్పోయి ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు  పలువురిని కంటతడి పెట్టించింది. 

పనుల కోసం వెళుతూ.. 
విజయవాడలో పనులు చేసేందుకు ఒడిశాలోని నవరంగ్‌పూర్‌ జిల్లా బోటిగూడకు చెందిన కొంతమంది శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సంగీత ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఎక్కారు. అక్కడి నుంచి 40 మందితో బయలుదేరిన బస్సు అర్ధరాత్రి దాటాక చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, బొడ్డుగూడెం మధ్యలో అదుపుతప్పి, అటవీ ప్రాంతంలో బోల్తాపడింది. షాక్‌కు గురైన ప్రయాణికులంతా ఏం జరిగిందో తెలుసుకునే లోపే బస్సు పక్కనే చిన్నారుల మృతదేహాలతో పాటు క్షతగాత్రులను చూసి మరింత ఆందోళన చెందారు. అటుగా ప్రయాణిస్తున్న వాహనాల డ్రైవర్లు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఏడుగురాళ్లపల్లి పీహెచ్‌సీకి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ధనేశ్వర్‌ దళపతి(24)తో పాటు జీతు హరిజన్‌(5), సునేనా హరిజన్‌(2) అనే చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. డుమూర్‌ హరియన్‌(40), చిన్నారి మహిసాగర్‌ మిత్రా(5) భద్రాచలం ఆస్పత్రిలో మరణించారు. 

డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? 
డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సు బయలుదేరినప్పటి నుంచే చాలా ర్యాష్‌గా నడిపేవాడని, మార్గమధ్యంలో బస్సు నడుపుతూనే మద్యం కూడా తాగాడని, వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా అలాగే వాహనాన్ని నడిపాడని ప్రమాదంలో గాయపడి భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్ర ఏసు అనే ప్రయాణికుడు తెలిపాడు. అటవీ ప్రాంతంలోకి రాగానే మరింత వేగం పెంచాడని మలుపు వద్ద అదుపు చేయలేక పోవడంతో బస్సు బోల్తాపడిందని చెప్పాడు. 

క్షతగాత్రులు వీరే.. 
ఈ ప్రమాదంలో గాయపడిన మరో తొమ్మిది మంది ప్రస్తుతం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒడిశాకు చెందిన మాధవ్‌పూజారి, వినోద్‌ దుర్గ, చంద్రపూజారి, కసబ్‌నాయక్, సుఖ్‌దేవ్, సుభద్ర, మిత్రాభాను, లక్ష్మణ్‌ హరిజన్, సుక్‌రాం హరిజన్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు