తల్లి ఆత్మహత్యాయత్నం.. బైకుపై బయలుదేరిన కుమారుడు.. అంతలోనే

13 Sep, 2021 08:58 IST|Sakshi

ఖమ్మం: కుటుంబ కలహాలతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా అక్కడకు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా, భర్త, సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. గంటల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

కారేపల్లి మండలం జైత్రాంతండా గ్రామానికి చెందిన ధరావత్‌ కౌసల్య కుటుంబంలో చోటుచేసుకున్న వివాదానికి మనస్థాపం చెంది ఆదివారం ఉదయం పురుగుల మందు తాగింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ పరిస్థితి విషమించటంతో ఖమ్మం ఆస్పత్రికి అంబులెన్స్‌లో పంపించారు. అనంతరం ఖమ్మం ఆస్పత్రికి కౌసల్య కుమారుడు ధరావత్‌ సురేష్‌(25) తన తండ్రి ధరావత్‌ సూర్య, మామయ్య కేలోతు గోపీతో కలిసి ద్విచక్రవాహనంపై ఆదివారం సాయంత్రం బయలుదేరాడు.

ఈక్రమంలో ఇల్లెందు – ఖమ్మం ప్రధాన రహదారిపై మంచుకొండ సమీపాన శివాయిగూడెం వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొంది. ఈఘటనలో సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా, సూర్య, కేలోతు గోపీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకేరోజు ఒకే కుటుంబంలో ఒకవైపు తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందడం... తండ్రి, మామయ్య తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో జైత్రాం తండాలో విషాదఛాయలు  అలుముకున్నాయి.  

చదవండి: డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు