‘మూడు తరాల’ మృత్యువాత!

10 Jun, 2023 02:06 IST|Sakshi

చిన్నారి అక్షరాభ్యాసానికి వెళ్లొస్తుండగా తాత, తల్లి, చెల్లి మృతి 

కారును ఢీకొట్టిన లారీ 

ఖమ్మం జిల్లాలో దుర్ఘటన

వైరారూరల్‌: ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారిసహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. బాసరలో బాబుకు అక్షరాభ్యాసం చేయించి స్వస్థలానికి తిరిగి వస్తుండగా వారి ప్రయాణం మధ్యలోనే ముగిసింది. వైరా మండలం పినపాక స్టేజీ వద్ద జాతీయ రహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ అతివేగంతో ఢీకొనడంతో అజ్మీరా రాంబాబు (52), ఆయన కుమార్తె బానోతు అంజలి (25), మనవరాలు బానోతు శ్రీవల్లి (18 నెలలు) మృతి చెందారు.

ఇదే ఘటనలో బానోతు బాబు, రాణి, స్వాతి, ప్రవీణ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బోడిమల్లె తండాకు చెందిన అజ్మీరా రాంబాబు, వాచ్యానాయక్‌ తండాకు చెందిన బానోతు బాబు వియ్యంకులు. బాబు, రాణి కుమారుడైన డెంటల్‌ డాక్టర్‌ నవీన్‌కుమార్‌తో రాంబాబు కుమార్తె అంజలికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కార్తికేయ, 18 నెలల కుమార్తె శ్రీవల్లి ఉన్నారు.

కార్తికేయకు బాసరలో అక్షరాభ్యాసం చేయించేందకు బానోతు బాబు, రాణి దంపతులు వారి కుమారులు నవీన్, ప్రవీణ్, కోడళ్లు అంజలి, స్వాతి, మనవరాలు శ్రీవల్లిని తీసుకుని వియ్యంకుడు అజ్మీరా రాంబాబుతో కలసి బాసర వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి ఖమ్మం చేరుకున్నారు. అక్కడే బంధువుల ఇంట్లో ఉండి శుక్రవారం మధ్యాహ్నం కారులో వాచ్యానాయక్‌ తండాకు బయలుదేరారు. కారు పినపాక స్టేజీ చేరుకుంటుండగా ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో రాంబాబు, ఆయన మనవరాలు శ్రీవల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె అంజలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గాయపడినవారిలో బాబు, ప్రవీణ్, స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ ఎం.ఎ.రెహమాన్, సీఐ తాటిపాముల సురేశ్‌ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  

మరిన్ని వార్తలు